పాక్ వైమానిక అధికారి
ఔరంగజేబు అంగీకారం
2019 నాటి చర్యకు సమర్థన
ఇస్లామాబాద్ : 2019 పుల్వామా దాడిలో తమ సైన్యం దాడి ఉన్నట్లు పాకిస్థాన్ ఇప్పటికి అంగీకరించింది. అప్పటి పుల్వామా దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు చనిపోయారు.ఈ ఘటనతో తమ సైన్యానికి ఎటువంటి సంబంధం లేదని ఇన్నేళ్లుగా పాకిస్థాన్ చెపుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మాట మార్చింది. ఆపరేషన్ సిందూర్ ఇతర పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక దళ అధికారి , వైస్ మార్షల్ ఔరంగజీబు అహ్మద్ పుల్వామా ఘటనపై ఇటీదల స్పందించారు. ఇది సామాజిక మాధ్యమాల ద్వారా ఆదివారం సర్వత్రా వెలుగులోకి వచ్చింది. పుల్వామా దాడి పాకిస్థాన్ సైన్యపు వ్యూహాత్మక చర్య అని ఈ అధికారి వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి తమ దేశ సైనిక వర్గాలు కనబర్చిన అత్యంత వ్యూహాత్మక తెలివితేటల ఫలితం అని పుల్వామా దాడిపై ఇన్నేళ్ల ఖండనను తోసిపుచ్చుతూ చెప్పారు. అహ్మద్ ఇప్పుడు పాకిస్థాన్ వైమానిక దళం (పిఎఎప్) పౌర సంబంధాల ఉన్నతాధికారి బాధ్యతల్లో కూడా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడుల దశలో ఇప్పుడు పాకిస్థాన్ ఉగ్ర చర్యల లోగుట్టు ఇప్పుడు పుల్వామా దాడుల అంగీకారంతో తేటతెల్లం అయింది.
చాలాకాలంగా పుల్వామా దాడుల సంగతి తమకు తెలియదని, ఈ ఘటనతో తమ దేశ సైన్యానికి ఎట్టి సంబంధం లేదని చాలాకాలంగా పాకిస్థాన్ బుకాయిస్తూ వచ్చింది. ఇటీవలి పహల్గాం ఉగ్రదాడులతో తమకు ఎటువంటి సం బంధం లేదని, పైగా భారత ప్రభుత్వం కశ్మీర్ పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుచుకునేందుకు ఈ దాడి ని పాకిస్థాన్‌పై నెట్టడానికి యత్నిస్తోందని పాక్ చెపుతూ వస్తోంది. అయితే పహల్గాం కన్నా ఘోరమైన పుల్వామా దాడి పని తమదే అని పాకిస్థాన్ ఇప్పుడు బహిరంగంగా తెలియచేయడంతో ఉగ్ర చర్యల పని పాకిస్థాన్‌దే అనే విషయం స్పష్టం అవుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ గగనతలం, సముద్ర మార్గం , భూభాగానికి , లేదా ప్రజలకు ఎటువంటి ముప్పు ఏ శక్తి నుంచి తలెత్తినా దీని విషయంలో రాజీ పడేది లేదని, చూసీ చూడనట్లుగా వ్యవహరించజాలమని ఔరంగజీబు అహ్మద్ తెలిపారు. సైన్యం ప్రజలకు జవాబుదారిగా ఉంటుంది ప్రజలు సైన్యంపై అపార నమ్మకం పెట్టుకుని ఉంటారని, దీనిని తా ము ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవడం జరుగుతుందని తెలిపిన ఈ అధికారి పాక్ సైన్యమే భారత్‌పై ప్రతీకారంతోనే పుల్వామా దాడికి దిగినట్లు మీడియా సమావేశం పెట్టి మరీ అంగీకరించారు.