పాకిస్థాన్ స్వయంకృతాపరాధాలే ఈనాడు అనేక విధాలుగా వెంటాడుతున్నాయి. ఉగ్రవాదం విషసర్పాలకు నిధుల పాలు పోసి పెంచడమేకాక, తమ నీడలో ఆశ్రయం కల్పించడం ప్రపంచ వేదిక మీదనే కాదు, తమకు మద్దతు ఇచ్చే దేశాల దృష్టిలోనూ పలుచనైపోతోంది. ఆపరేషన్ సిందూర్ పేరున భారత్ పాకిస్థాన్ పరిధిలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పాకిస్థాన్ కోట్లీ మిలిటరీ క్యాంపస్‌కు కేవలం రెండు కిమీ దూరంలోనే మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం ఉందంటే ఏమనుకోవాలి? పాకిస్థాన్ రక్షణ మంత్రి కూడా ఉగ్రవాదులకు తమ ప్రోత్సాహం ఉండడం పొరపాటే అని ఒప్పుకున్నారు కూడా. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ సైనికులు హాజరు కావడం అనేక దేశాలు తప్పు పడుతున్నాయి. ఈ వాస్తవాలన్నిటినీ విస్మరించి పాకిస్థాన్ తన సార్వభౌమత్వానికి భారత్ తీవ్ర విఘాతం కలిగించిందని ప్రచారం చేయడం విస్మయం కలిగిస్తోంది. అణ్వాయుధాలను ఇప్పుడు ప్రయోగిస్తామని బెదిరిస్తోంది.
అమెరికన్ సైంటిస్టుల ఫెడరేషన్ వివరాల ప్రకారం పాకిస్థాన్ తన అణ్వాయుధాలను తన దేశంలో అనేక చోట్ల గుట్టుగా పెట్టి ఉంచింది. భారత్‌కు 180 వరకు అణ్వాయుధాలు ఉండగా, పాకిస్థాన్‌కు 170 వరకు సరిసమానంగా అణ్వాయుధాలు ఉన్నాయని ఫెడరేషన్ పరిశీలనలో తేలింది. ఇంత భారీగా అణ్వాయుధాలను ఎలా సేకరించిందో అంతుపట్టడం లేదని అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ దగ్గర భూ ఆధారిత వ్యూహాత్మక, యుద్ధభూమి శ్రేణి బాలిస్టిక్ క్షిపణి హెచ్‌ఎటిఎఫ్ ఉంది. ఇవి గరిష్ఠంగా వంద కిలోమీటర్ల లోపు లక్షాలను ఛేదిస్తాయి. సింధుజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఎప్పుడైతే భారత్ ప్రకటించిందో అప్పటినుంచి అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్ హెచ్చరించడం మొదలు పెట్టింది. సింధుజలాలు అందకుంటే తమ దేశంలో జలవిద్యుత్ ఉత్పత్తికి, ప్రజల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పాకిస్థాన్ భయపడుతోంది. అందుకనే అణ్వాయుధాల బూచిని చూపించి భారత్‌ను భయపెడుతోంది.
భద్రతా మండలి సమావేశంలో ఇరుగుపొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, యుద్ధం వరకు పరిస్థితి తీసుకురావద్దని సూచనలు వచ్చినా పాక్ పెడచెవిని పెడుతోంది. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అల్ అరేబియా వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఉభయ దేశాలకు యుద్ధం ప్రత్యామ్నాయం కాబోదని, అణుయుద్ధమే వస్తే ఎవరూ బతకరని అన్నారు. తాము అణ్వస్త్ర దేశమే అయినప్పటికీ, ఆత్మరక్షణ కోసమే తప్ప ఎవరిమీదనో ప్రయోగించడానికి కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇప్పుడు అణ్వాయుధ ప్రయోగం గురించి ఎందుకు మళ్లీ ప్రస్తావిస్తున్నారో, ఎవరి అండచూసుకుని బెదిరిస్తున్నారో తెలియడం లేదు. అణ్వాయుధ ప్రయోగం ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది. గత కొన్నేళ్ల నుంచి ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్ కూరుకుపోతోంది.
2023 జూన్‌లో వరదల వల్ల పాకిస్థాన్ 30 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయింది. చైనాతో సంబంధాలు పాకిస్థాన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ఇస్లామాబాద్ శక్తికి మించిపోయింది. దీనివల్లనే పాకిస్థాన్ 64 బిలియన్ డాలర్ల వరకు చైనాకు రుణపడవలసి వచ్చింది. సౌదీ అరేబియాతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ పాక్‌కు గట్టెక్కేదారి కనిపించడం లేదు. షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి గట్టిగానే ప్రయత్నించారు. అంతకు ముందు 1999 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ పాకిస్థాన్‌తో మైత్రికి ఎంతో కృషి చేశారు. లాహోర్‌కు బస్సు యాత్ర నిర్వహించారు.ఆ తర్వాతే కార్గిల్ యుద్ధం జరిగి భారత్ గెలిచింది. ఆ తర్వాత ఢిల్లీ ఖాట్మండ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు.
అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ఉగ్రవాదుల డిమాండ్‌కు తలవంచి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్‌ను విడుదల చేశారు.అప్పటి నుంచి పాకిస్థాన్ ప్రోత్సాహం వల్లనే ఉగ్రవాదుల మారణకాండ సాగుతోందనడానికి ఎన్నో సంఘటనలు ఉదాహరణగా నిలుస్తాయి. అయితే నేరుగా పాకిస్థాన్ అణ్వాయుధాలను ప్రయోగించేటంత శత్రుత్వస్థాయి ఇప్పటికింకా లేదని అణువిజ్ఞాన నిపుణులు చెబుతున్నారు. భారతదేశ కోల్డ్ స్టార్ డాక్ట్రిన్ (చల్లని ప్రారంభ సిద్ధాంతం) ప్రకారం పదాతిదళాలతో శత్రుసేనలను ఎదుర్కొంటాయి తప్ప ఎలాంటి అణ్వాయుధాలకు అవకాశం ఇవ్వరని నిపుణులు చెబుతున్నారు. అయితే మున్ముందు రెండు దేశాలు ప్రతీకారాలు పెంచుకోవడం, ఉద్రిక్తతలు కొనసాగించడం నిత్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది.
రెండు వైపులా తమ లక్షాలను సాధించుకోవడానికి భౌగోళికంగా సైన్యాలు పోరాటం సాగిస్తుంటాయి. అందువల్ల అణ్వాయుధ ప్రయోగం వైపు రెండు దేశాలు మొగ్గు చూపితే ప్రపంచ దేశాలకే సమస్యగా పరిణమించవచ్చు. రెండు దేశాల వద్దనున్న చెరో 160 అణ్వాయుధాలు యుద్ధక్షేత్రంలో వినియోగించవలసి వస్తే స్వల్పశ్రేణి వ్యవస్థలు కూడా కీలకంగా మారతాయి. అంతులేని తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. సైనిక బలగాలను పెంచుకోవడం, విపరీతంగా నిధులు వెచ్చించడం, ఆయుధాగారాలను ఎప్పటికప్పుడు ఆయుధాలతో భర్తీ చేసుకోవడం ఇవన్నీ తీరని అనర్థాలే. అందుకనే భారత్‌పాకిస్థాన్ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ప్రపంచ అగ్రదేశాలు సూచనలు ఇస్తున్నాయి.