పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం తమ దేశంలోని భారత దౌత్య వ్యదహారాలఅధినేత (ఐసిఎ)గీతికా శ్రీవాత్సవను పిలిపించి మాట్లాడింది. తెల్లవారు జామున జరిగిన ఆపరేషన్ సిందూర గురించి ప్రశ్నించింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతీయ సైన్యం ఆపరేషన్ సిందూర పేరిట దాడులు జరిపింది. ఈ క్రమంలోనే పలు ఉగ్ర శిబిరాలు ధ్వంసం అయ్యాయి. వంద మంది వరకూ ఉగ్రవాదులు హతులు అయ్యారు. ఇస్లామాబాద్‌లోని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రావల్సిందిగా భారత దౌత్యాధికారిణికి ముందుగా సమన్లు వెలువరించారు. ఉగ్రవాదుల ఏరివేత పేరిట సాగిన ఈ దాడిలో పలువురు పౌరులు , పిల్లలు, మహిళలు మృతి చెందారని, ఈ చర్యకు ఎవరు బాధ్యత వహిస్తారని పాకిస్థాన్ ఈ సందర్భంగా భారతీయ ప్రతినిధిని నిలదీసింది.
అయితే ఉగ్రవాదుల ఉనికి గురించి తెలిసినందునే , నిర్ణీత లక్షాలను ఎంచుకుని భారత సేనలు దాడికి దిగాయని గీతిక తెలిపింది. ఈ వాదనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. ఉగ్రవాద నిర్మూలన పేరిట ఆధారాలు లేకుండా సాగించిన ఈ సైనిక చర్య విచక్షణారహితం, పైగా తమ దేశ సుస్థిరత, సమగ్రతలకు భంగకరం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నిరసనకు భారతీయ దౌతాధికారిణి సరైన రీతిలోనే ఎదురుదాడికి దిగారని అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి నరమేధం సాగిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని నిలదీసిన గీతిక ఈ విషయంలో తమ దేశ వైఖరి సబబే అని చెప్పి బయటకు వచ్చినట్ల వెల్లడైంది.