వాషింగ్టన్: భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియా దేశ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి వాషింగ్టన్, ఇస్లామాబాద్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని.. దాని కోసం పాకిస్థాన్ తో కలిసి పనిచేస్తామని చెప్పాడు. భవిష్యత్తులో పాక్ భారత్‌కు చమురు విక్రయించే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు.
ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేస్తూ.. “మేము పాకిస్తాన్ తో ఇప్పుడే ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. చమురు నిల్వలను అభివృద్ధి చేయడంలో పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ కలిసి పనిచేస్తాయి. ఈ భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని వెతుకుతున్నాం. ఎవరికి తెలుసు, బహుశా పాకిస్థాన్ ఏదో ఒక రోజు భారత్ చమురు అమ్మే అవకాశం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నాడు.
కాగా, రష్యా నుంచి సైనిక పరికరాలు, ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.