పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన పాక్ ముష్కరుల స్థావరాలపై భారత సైనిక, వైమానిక, రక్షణ దళాలు క్షిపణులతో అగ్నివర్షం కురిపించాయి. ఉగ్రవాదంపై ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన మహోగ్ర దాడిలో పాకిస్థాన్‌గడ్డపై ఇష్టారాజ్యంగా నడుపుతున్న ఉగ్రవాద శిక్షణా స్థావరాలు సమూలంగా బూడిద కుప్పలుగా మారాయి. లక్ష్యాలను ఛేదించడం లో, శత్రుస్థావరాలను నేలమట్టం చేయడంలో మన సైనిక దళాల పాటవానికి ‘సిందూర్’ నిలువుటద్దం పడుతున్నది. ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఇండియా గురిపెట్టి గట్టిగా చావుదెబ్బ కొట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ భూభాగం, ఆక్రమిత కశ్మీర్లోని అనేక ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్టు వీడియో సహిత వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
రక్షణ నిబంధనల రీత్యా ఇంకా పూర్తి సమాచారం బయటికి రానప్పటికీ ఉగ్రవాద మూలాలను తుదముట్టించే లక్ష్యంతో ఇవి జరిగాయనేది అధికారిక సమాచారం. భారత రక్షణ దళాలు మొత్తం తొమ్మిది లక్ష్యాలను ఎంచుకోగా అందులో ఐదు పాక్ భూభాగంలో, మిగిలిన నాలుగు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. ఉగ్రదాడులకు పథకాలు వేసే, ఆ దాడులను నిర్దేశించే ప్రదేశాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించినట్టు రక్షణశాఖ వెల్లడించడం విశేషం. అక్కడి ప్రజలకు, ఆస్తులకు నష్టం జరగకుండా మన సైన్యం మానవత్వాన్ని చాటిచెప్పింది. మన లక్ష్యం ఉగ్రవాద మూకల రహస్య స్థావరాలను ధ్వంసం చేయడం. అందుకే భారత వైమానిక దళం ప్రధానంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల స్థావరాలను లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం 24 ప్రకంపనలు సంభవించినట్టు పాక్ అధికారికంగా వెల్లడించింది.
అంతేకాకుండా తొలి వార్తల్లో 26 మంది మరణించినట్టు ప్రకటించింది. తమ వాళ్లు 14 మంది భారత్ దాడుల్లో మరణించినట్టు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రకటించడం గమనార్హం. తన భూ భాగాన్ని భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా మార్చిన పాక్ స్పందన ‘తేలుకుట్టిన దొంగల’ తరహాలో ఉన్నది. ఆత్మరక్షణ కోసం స్పందించే హక్కుతనకున్నదని, తగిన సమయంలో దానిని ఉపయోగిస్తామని పాక్ ప్రభుత్వం చెప్పడం కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదు. ఈ దాడుల విపత్తును ఒక రకంగా పాకిస్థాన్ తనంతట తానుగా కొనితెచ్చుకున్నదే. మతోన్మాద ఉగ్రమూకలను పెంచి పోషించి, భారత్‌పై పాక్ మొదలుపెట్టిన పరోక్ష యుద్ధం ఇప్పుడు తుది ఘట్టానికి చేరుకున్నది. ఇకనైనా తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పని సమయం వచ్చింది. భారత్ రక్తమోడుతుంటే రాక్షసానందం పొందిన పాక్ సైనిక నాయకత్వం పరిహారం చెల్లించుకునే రోజు రానే వచ్చింది.
ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు పాక్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు రెండు రోజుల కిందట జరిగిన ఐక్యరాజ్య భద్రతా మండలి సమావేశం కూడా పాకిస్తాన్‌ను ఘాటుగా చివాట్లు పెట్టింది. అందుకే ఈ విషయంలో ఎలాంటి తీర్మానం చేయకుండానే ముగిసింది. పైగా కశ్మీర్ సమస్యను లేవనెత్తేందుకు పాక్ జరిపిన ప్రయత్నాలు పేలవంగా తేలిపోవడమూ కూడా పొరుగు దేశ వైఫల్యాన్ని సూచిస్తున్నది. ఉగ్రవాదం అనే విషపు మొక్కను తన పెరడులో పెంచి పోషించిన పాకిస్తాన్ ప్రపంచం ముందు తలదించుకుని దోషిగా నిలబడింది. పహల్గాంలో అమానుషమైన రీతిలో అమాయకులను చంపిన దుర్మార్గులు పాక్‌లోని తమ సూత్రధారులతో ఎప్పటికప్పుడు రహస్య సంప్రదింపులు జరిపినట్టు రుజువులు కూడా దొరికాయని భారత విదేశాంగ శాఖ తాజాగా ధ్రువీకరించింది. భారత్ జరిపిన దాడులకు ఇంతకన్నా బలమైన హేతువు ఇంకేం కావాలి? ఇకనైనా పాక్ పశ్చాత్తాపం ప్రకటించి తన తప్పులు సరిదిద్దుకోవాలి లేదా ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయి.
- కె.ఆర్. కిశోర్ – 98493 28496