ఆపరేషన్ సిందూర్‌ను జీర్ణించుకోలేని పాకిస్థాన్ .. మనదేశం మీదకు క్షిపణులు, డ్రోన్లు, ప్రయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ తర్వాత అక్కసుతో పంజాబ్‌లో అమృత్‌సర్ లోని స్వర్ణదేవాలయాన్ని లక్షంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు.వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టామని తెలిపారు. మన ఆపరేషన్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది.
మిలిటరీ టార్గెట్లతో పాటు పౌరులకు చెందిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించింది.‘ పాక్‌కు ఎలాంటి కచ్చితమైన లక్షాలు లేవని తెలుసు. గోల్డెన్ టెంపుల్‌ను లక్షంగా చేసుకునే అవకాశాలు కనిపించాయి. ముందుగానే ఊహించడంతో దానికి అదనపు రక్షణ కల్పించాం. పూర్తిగా సిద్ధమయ్యాం. మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్.. పాకిస్థాన్ సైన్యం ప్రణాళికలను తిప్పి కొట్టారు. మన స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారు ” అని మేజర్ జనరల్ వెల్లడించారు.