పరీక్షకు పంపించిన అధికారులు
హోషియార్‌పూర్ (పంజాబ్) : భారత సైనిక బలగాల అధునాతన సాంకేతిక ఆయుధ వ్యవస్థలతో కుప్పకూల్చిన పాక్ క్షిపణి శకలం లభ్యం అయింది. గాలింపు చర్యల్లో భాగంగా సిబ్బందికి క్షిపణి భాగాలను పోలిన ఓ వస్తువు దొరికిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఉన్నట్లుండి పంజాబ్‌లోని అత్యంత కీలకమైన స్థావరాలను ఎంచుకుని పాక్ తన వైమానిక దాడులు ముమ్మరం చేసింది. వీటిని అంతే వేగంగా స్పందించిన భారతీయ సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో కూలిన క్షిపణి భాగాలను హోషియార్‌పూర్ ప్రాంతంలోని కామాహి దేవి గ్రామం వద్ద పొలాల్లో గుర్తించారు.
ఇవి ఇనుప ముక్కలని, వీటిని క్షిపణి భాగాలని తాము భావిస్తున్నామని హోషియార్‌పూర్ జిల్లా ఎస్‌పి ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ వస్తువును పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. గురువారం పాకిస్థాన్‌కు చెందిన పలు క్షిపణులను భారతీయ ఆయుధ పాటవంతో దెబ్బతీశారు. ఏకంగా దూర ప్రాంతంలోని లాహోర్ వరకూ పాక్ యుద్ధ విమానాలను వేటాడుతూ వెళ్లిన మన సేనలు లాహోర్ వాయుసేనకు చెందిన కీలకమైన ఆయుధ వ్యవస్థను దెబ్బతీశాయి. క్షిపణి భాగాలు దొరికిన చోటుకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది తరలివచ్చింది.
నమూనాలను సేకరించింది. వీటిని తమ వెంట తీసుకుని వెళ్లారు. వీటి ఉనికి గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతారు. అటు జమ్మూ కశ్మీర్ ఇటు పంజాబ్‌లోని పలు ప్రధాన నగరాలను, భారత సైనిక కీలక విభాగాలు ఉండే కేంద్రాలను ఎంచుకుని పాక్ సైన్యం దాడులకు దిగింది. వీటిని భారతీయ సైన్యం చిత్తు చేసింది. అనేక విధాలుగా అత్యంత సున్నితమైన ప్రాంతాలు అమృత్‌సర్, జలంధర్, హోషియార్‌పూర్ ఇతర చోట్ల పాక్ సేనలు వ్యూహాత్మక దాడులకు దిగుతున్నాయి. దీనితో ఇంటలిజెన్స్ వర్గాల ముందస్తు సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ భారత త్రివిధ బలగాలు ఇప్పుడు ఎప్పటికప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటూ దాడులను తిప్పికొట్టడమే కాకుండా ఎదురుదాడులకు కూడా దిగుతున్నాయి.