Sunday, May 18, 2025

హద్దులు మీరిన సోదరప్రేమ

- Advertisement -
- Advertisement -

ఓవైపు మిత్రదేశం, మరో వైపు సోదరదేశం. ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలనే మీమాంస ఎదురైతేసాధారణంగా సోదర దేశానికే ఓటు వేయడం కద్దు. ప్రస్తుతం టర్కీ చేస్తున్నదదే. ‘పాకిస్తాన్ నా రెండో ఇల్లు, పాక్ ప్రజలు నా సోదరులు’ అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారీ తన ప్రేమాభిమానాలను చాటుకునే ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్ తో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ సమయంలో పాకిస్తాన్ వైపే నిలబడటంలో ఆశ్చర్యమేముంది? ఆయన మాటల్లో చెప్పాలంటే భారత్ తమకు మిత్రదేశమైతే, పాకిస్తాన్ సోదరదేశం. భారత్-పాక్ సంక్షోభంలో పశ్చిమాసియాలో ఏ దేశమూ పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూడకపోగా, ఒక్క టర్కీ మాత్రమే ఆ దేశంతో అంటకాగడానికి కారణాలు అనేకం.

ఇందులో ప్రధానమైనవి దౌత్య, వాణిజ్య సంబంధాలు. భారత్, టర్కీల మధ్య దౌత్య సంబంధాలు 1948లోనే మొదలైనా, ఇన్నేళ్లలో ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం పెరగకపోగా వాణిజ్య బంధం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో టర్కీ అమెరికా పంచన చేరగా, భారత్ మాత్రం అలీన విధానాన్నే నమ్ముకుంది. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ టర్కీలో పర్యటించాక, ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త బలోపేతమైనా, సాన్నిహిత్యం మాత్రం పెరగలేదు. ఎనిమిదేళ్ల క్రితం టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ భారత్ లో పర్యటించిన దరిమిలా, 2019లో ప్రధాని మోడీ టర్కీ పర్యటనకు సిద్ధమయ్యారు. కానీ, ఐక్యరాజ్య సమితిలో ఎర్డోగాన్ ప్రసంగం భారత్ కు వ్యతిరేకంగా ఉండటంతో మోడీ తన ఆలోచనను విరమించుకున్నారు. రెండేళ్ల క్రితం భారీ భూకంపం టర్కీని కుదిపివేసిన సమయంలో భారత్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట ఆ దేశంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు చేయూతనిచ్చింది.

ఇందుకు భారత్ లో అప్పటి టర్కీ రాయబారి హర్షం వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఈ ఆపరేషన్ ప్రతిబింబించిందని, స్నేహితులు ఒకరికొకరు సాయం చేసుకోవడం రివాజేనని వ్యాఖ్యానించారు. కానీ రెండింటిలో ఒకదానిని ఎంచుకోవలసి వస్తే మాత్రం టర్కీ ఓటు పాకిస్తాన్ కే. ఎందుకంటే, ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య బంధాలు ఏళ్లతరబడి పెనవేసుకుపోయాయి. ముఖ్యంగా టర్కీనుంచి పాకిస్తాన్ భారీయెత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఐదేళ్ల క్రితం 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తి కొనుగోలుకు పాక్ ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఏడాది మరో 30 యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా ఒప్పందం ఖరారైనా, అమెరికా జోక్యంతో నిలిచిపోయింది.

ఇక గతంలో పాకిస్తాన్ కుటర్కీ ఫాల్కన్ జెట్ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను విక్రయించడంతోపాటు అగస్టా 90 జలాంతర్గాముల ఆధునీకరణలో చేయూత అందిస్తోంది. మరోవైపు ఈ రెండు దేశాలూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ లో సభ్య దేశాలు కావడంతో మతపరంగానూ రెండింటిమధ్య విడదీయరాని బంధం పెనవేసుకుంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సహజంగా భారత్ వ్యతిరేకి. అంతర్జాతీయ వేదికలపై ఆయన కశ్మీర్ విషయంలో దాయాది దేశాన్ని వెనకేసుకు రావడం తెలిసిన విషయమే. తాజా సంక్షోభంలో ఆయన పహల్గాం సంఘటనను ఖండించకపోగా, పాక్ వాదనకే వత్తాసు పలికారు. పాక్ పై భారత్ దాడి చేస్తుందని గ్రహించిన వెంటనే తమ యుద్ధ నౌకను కరాచీ పోర్టుకు పంపడంతోపాటు ఆయుధ సామగ్రిని విమానంలో పాక్ కు చేరవేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ పంపిన డ్రోన్లనే పాకిస్తాన్ ప్రయోగించినట్లు భారత సైన్యం ధ్రువీకరించింది కూడా. యుద్ధ సమయంలో సోదరదేశానికి అండగా నిలబడటంలో తప్పు లేదు గానీ, ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న పాకిస్తాన్ వంటి దేశాన్ని వెనకేసుకురావడం ముమ్మాటికీ సహించరాని విషయం.

ఇందుకు ప్రతిగా భారత్ ఆ దేశంతో వాణిజ్య బంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి నిర్ణయించడం ఎంతైనా సముచితం. ప్రభుత్వానికి మద్దతుగా వ్యాపార, వాణిజ్య, విమానయాన సంస్థలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి, ‘బ్యాన్ టర్కీ’ పేరిట ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువుల విక్రయానికి నిరాకరించడం విశేషం. పర్యాటకం ప్రధాన వనరైన టర్కీకి భారత పర్యాటకుల ద్వారా అధికాదాయం సమకూరుతోంది. గత ఏడాది టర్కీకి వెళ్లిన భారత పర్యాటకుల సంఖ్య మూడు లక్షల పైచిలుకే. ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఏ దేశానికైనా దీటుగా జవాబివ్వాలన్న భారత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. ఇలాంటి సమయంలో టర్కీకి ప్రత్యామ్నాయంగా మధ్యదరా సముద్ర ప్రాంతంలో గ్రీస్, సైప్రస్ దేశాలతో దౌత్య, వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత్ ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News