అధిక సంతానం, ఆపై పేదరికం.. చేసేదేమీ లేక తమ ఐదో సంతానమైన తన ఆడబిడ్డను విక్రయించారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. తమకు పుట్టిన పసిబిడ్డను మధ్యవర్తుల సాయంతో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారికి విక్రయించారు. ఈ మేరకు చైల్డ్ వెల్పేర్ అధికారిణి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటో టౌన్ సిఐ రఘుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముత్యాలమ్మ, వెంకట్రావుకు అప్పటికే నలుగురు ఆడబిడ్డలు ఉన్నారు.
జూన్ 30న ఐదో సంతానంలో కూడా ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఆడపిల్లలను పోషించడం తమకు భారమవుతుందని భావించిన ఆ తల్లిదండ్రులు అదే ప్రాంతానికి చెందిన ఉమారాణి అనే మహిళ ద్వారా తమకు పరిచయస్తులు అయిన నాగమణి అనే మహిళతో కలిసి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తికి ఆ పసిబిడ్డను ఈనెల 6న రూ.2 లక్షలకు విక్రయించారు. పసికందును విక్రయించిన విషయం తెలియడంతో సిడిపిఒ సౌందర్య శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సిఐ రఘుపతి తెలిపారు.