Wednesday, July 23, 2025

రెండో రోజూ పార్లమెంటు వాయిదా

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టు
వరస వాయిదాల అనంతరం ఉభయ సభలు నేటికి వాయిదా

న్యూఢిల్లీ: బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ అంశం సహా పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు గొడవ చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఉదయం రెండు సార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైన వెంటనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా అంశంపై చర్చ జరగాలని పట్టుబడుతూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు చెందిన ఆందోళనకు దిగారు. సభ జరగడానికి పార్టీ సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్లాల్సిందిగా కోరాలని స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా ప్రతిపక్షాల నేతలకు పదేపదే సూచించినా గొడవ ఆగకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్షాలఖరిని తప్పుబట్టారు. తొలుత ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరగాలని సోమవారం సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో అంగీకరించి చర్చ కోసం సమయం కూడా కేటాయించడం జరిగిందని రిజిజు గుర్తు చేశారు.ఏ నిబంధన కింద చర్చ జరగాలనే విషయం మాత్రమే నిర్ణయించలేదని ఆయన తెలిపారు. కాగా ఈ రోజు ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు తీసుకుని సభకు వచ్చారని, దీన్ని తాను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఓ వైపు చర్చ జరగాలని కోరుతూ మరో వైపు గొడవ చేస్తున్న ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరిని తాను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రతిపక్షాలు సమయాన్ని వృథా చేస్తున్నాయని రిజిజు విమర్శించారు. అయినప్పటికీ గొడవ ఆగకపోవడంతో ఆయన సభను బుధవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల తొలిరోజు సోమవారం కూడా ప్రతిపక్షాల గొడవ కారణంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడిన విషయం తెలిసిందే.

రాజ్యసభలో కూడా అదే సీన్
రాజ్యసభలో కూడా దాదాపుగా అదే సీన్ రిపీట్ అయింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు లేచి బీహార్‌లో ఓటర్ల జాబితా అంశంపై చర్చ జరగాలని పట్టుబడుతూ గొడవకు దిగారు.అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఆపరేషన్ సిందూర్‌పై సభలో చర్చ జగాలని కూడా వారు పట్టుబట్టారు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు సభ్యులు మిగతా కార్యక్రమాలను రద్దు చేసి బీహార్ ఓటర్ల జాబితాపై చర్చ జరగాలని కోరుతూ వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చారు. ప్రతిపక్షాల గొడవ కారణంగా ఉదయం రెండు సార్లు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ను సముద్రం గుండా సరకుల రవాణాకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా కోరారు. అయితే ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేయడం ప్రారంభించడంతో చేసేది లేక డిప్యూటీ చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

సభకు అధ్యక్షత వహించిన రఘువంశ్

కాగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసిన కారణంగా మంగళవారం ఉదయం సభా కార్యక్రమాలకు డిప్యూటీ చైర్మన్ రఘువంశ్ అధ్యక్షత వహించారు. సాధారణంగా సభా కార్యక్రమాలు ప్రారంభమయినప్పుడు ధన్‌ఖడ్ సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించేవారు. అయితే ఆయన రాజీనామా చేయడంతో రఘువంశ్ ఆయన స్థానంలో కార్యకలాపాలకు అధ్యక్షత వహించారు.

రాష్ట్రపతితో రఘువంశ్ భేటీ

ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కూడా అయిన .గదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం రాష్ట్రపతి ద్రౌది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News