పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నెలరోజుల ఈ సమావేశాలు ఆరంభం నుంచి కీలకమైన చర్చలకు వీల్లేకుండా, అత్యంత కీలకమైన దైనందిన ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండా ముగిశాయి. సెషన్ జులై 21న ఆరంభం అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంబంధిత ఓటర్ల జాబితా సవరణల (సర్) అంశం ఆది నుంచి అంతం వరకూ వివాదాస్పదం అయింది. ఈ సర్ ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున ఓట్లచోరీ జరిగిందని, దీనిపై ముందుగా చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సారథ్యంలో ఆప్ మినహా ఇతర పార్టీలు ఒక్కటిగా నిలిచి పట్టుపట్టాయి. అయితే ఎన్నికల సంఘం వ్యవస్థాగత అంశం. పైగా దీనిపై విచారణ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తావన కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఉభయ సభలు దాదాపుగా ప్రతి రోజు వాయిదా పడుతూ వచ్చాయి. సభ్యుల నినాదాలు, పరస్పర ఆరోపణల నడుమ చివరికి వాకౌట్ల మధ్యనే ప్రభుత్వం 14 బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో 12 బిల్లులకు ఆమోదం దక్కింది.
అత్యంత కీలమైన బిల్లులు కూడా ఆమోదం పొందాయి. దేశంలో ఆన్‌లైన్ గేమ్స్, సంబంధిత యాప్స్‌పై నిషేధ బిల్లు , సముద్ర జలాల రవాణా సంబంధిత బిల్లు ఆమోదం పొందాయి. రెండు సభలలోనూ సర్ ఎటువంటి చర్చకు వీలులేకుండా అజెండాలకు అడ్డం పడింది. గురువారం చివరి రోజున ఉదయం 11 గంటలకు ముందుగా లోక్‌సభ ఓ సారి సర్ అంశంపైనే వాయిదా పడింది. తరువాత 12 గంటకు కూడా ఇదే పరిస్థితి సాగింది. మధ్యాహ్నం తరువాత స్పీకర్ ఓం బిర్లా లాంఛనపూర్వకంగా ఈ సెషన్ ముగింపు ప్రసంగం చేసి తరువాత సభ నిరవధిక వాయిదా విషయాన్ని ప్రకటించారు. ఇక ఎగువసభ రాజ్యసభ కూడా చివరి రోజున కూడా సర్ వివాదంపై గందరగోళం నడుమ నిరవధికంగా వాయిదా పడింది. సభలో అంతకు ముందు గందరగోళం నడుమ ఎటువంటి చర్చ లేకుండానే ఆన్‌లైన్ గేమ్స్ నిషేధం బిల్లు ఆమోదం పొందింది. పలు కీలక విషయాలపై చర్చకు వీల్లేకుండా పోయిందని ఇది బాధాకరం అని రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సభ ఈ విధంగా సాగినందుకు బాధపడుతూ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.