Wednesday, August 27, 2025

ఈ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ సమావేశాల ముగింపు సమయంలో హడావుడిగా 130 వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు తమ పదవుల నిర్వహణలో ఎలాంటి అవినీతికి, అవకతవకలకు చోటివ్వకుండా జవాబుదారీతనంతో ఉండాలన్న లక్షంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టినట్టు కేంద్రం వెల్లడించింది. తీవ్ర నేరాభియోగాలున్న కేసుల్లో జైలుకెళ్లి 30 రోజుల్లోపు బెయిల్ పొందలేకపోయిన ప్రధాని నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు అయినాసరే పదవులు వెంటనే పోయేలా ఈ బిల్లు తెచ్చామని కేంద్రం చెబుతోంది. అయిదేళ్లకు మించి శిక్షపడడానికి అవకాశం ఉన్న తీవ్రమైన కేసుల్లోనే పదవిని వదులుకోవలసి వస్తుంది తప్ప చిన్న చిన్న ఆరోపణలతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వూలో వెల్లడించారు.

బెయిల్ పొందిన వెంటనే నాయకులు తమ పదవులు స్వీకరించవచ్చని, 30 రోజులకు బదులు 40 రోజులకు బెయిల్ వస్తే 41వ రోజు మళ్లీ పొందవచ్చని షా చెప్పారు. అయితే విపక్షాలు, న్యాయకోవిదులు ఈ ప్రతిపాదనలు కేవలం అధికార కేంద్రీకరణ చట్టబద్ధం చేయడానికే అని ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. ప్రధానికి కూడా ఈ ప్రతిపాదిత చట్టపరమైన పాలన వర్తిస్తుందని కేంద్రం చెబుతున్నా ఆచరణలో అసాధ్యం. ఎందుకంటే దరాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలోనే ఉంటాయన్నది వాస్తవం. దర్యాప్తు సంస్థలు అనేక మంది విపక్ష ముఖ్యమంత్రులను అరెస్టు చేసినప్పటికీ ఏ దర్యాప్తు సంస్థా ప్రధానిని అరెస్టు చేయలేదు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తదితర కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరును పరిశీలిస్తే కేంద్రం కనుసన్నల్లో అవి ఎలా పని చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త బిల్లు ప్రతిపాదనల్లోని అసలు ఉద్దేశం రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా విస్తృతమైన అధికారాలతో ఏకపక్ష శక్తులతో తనను తాను బలోపేతం చేసుకోవడానికే అని తెలుస్తోంది. ఇక పోలీసు యంత్రాంగం అరెస్టు పట్లనే ఆసక్తి చూపిస్తుంది. బెయిల్ మంజూరు విషయం పరిశీలిస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ వంటి చట్టాల్లో నిబంధనలు చాలా కఠినతరంగా ఉండడంతో బెయిల్ దొరకడం అంత సులువు కాదు. బెయిల్ మంజూరు చేయడంలో న్యాయపరమైన వ్యత్యాసం స్వేచ్ఛను కలవరపెట్టే విధంగా, బెయిల్ మాట వదులుకోవలసిన విధంగా చేస్తోంది. అవినీతి అన్నది సమాజానికి ప్రమాదకరమైనదే. కానీ దానిని ఎదుర్కోడానికి న్యాయ సూత్రాలను పణంగా పెట్టకూడదు. గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి ఆరోపణల విచారణలు రాజకీయ ప్రేరేపితమైనవిగా స్పష్టమవుతుండడం గమనార్హం.

ఎవరైనా ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి అయితే దర్యాప్తును టార్గెట్‌గా చేసుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి బిజెపి వైపు మారితే ఇక దర్యాప్తు అన్నదే వెనక్కుపోతోంది. ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనలు చట్టంగా మారి అమలులోకి వస్తే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి న్యాయమైన విచారణ కానీ, న్యాయపరమైన శిక్ష చెప్పనవసరం కానీ లేకుండానే కేవలం పోలీస్ చర్యతోనే బాధ్యతల నుంచి తప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బిల్లు నిశ్చయతను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. ఇది కూడా ఫెడరల్ (సమాఖ్య) సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రతిపక్షానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పోలింగ్‌కు నెల రోజుల ముందు ఏదో ఒక పన్నాగంతో అరెస్టు చేయిస్తే అతని పార్టీ నిర్వీర్యమైపోతుంది. అరెస్టయి కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరూ దోషి కాదు. అరెస్టయిన వ్యక్తి నిర్దోషి కావచ్చు.

కానీ ఈలోగా ఆ వ్యక్తి నేరం చేసిన వాడిగా ప్రజల దృష్టిలో ముద్రపడేలా చేయడమే ఈ తతంగం. నేరం రుజువయ్యే వరకు ఎవరినీ దోషిగా చూడకూడదన్న న్యాయశాస్త్ర సిద్ధాంతానికి ఈ రాజ్యాంగ సవరణ తూట్లు పొడుస్తుంది. అధికారంలో ఉన్న పాలకవర్గం తమ ప్రత్యర్థి ముఖ్యమంత్రిని అరెస్టు చేయించి, ఆ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేయవచ్చు. ప్రభుత్వాలను పడగొట్టడానికి బ్యాలట్ కన్నా లాకప్ ఒక మార్గంగా మారుతుంది. అరెస్టయిన వారు బెయిల్ సంపాదించ లేకుండా మాయోపాయాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. బెయిల్ దరఖాస్తును పరిశీలించే జడ్జీలు ఎవరు పాలిస్తారో నిర్ణయించే శక్తిమంతులుగా మారతారన్న అపోహలు కలుగుతున్నాయి. పెండింగ్ కేసుల భారంతో సతమతమవుతున్న కోర్టుల్లో కేసుల విచారణ పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో అందరికీ తెలిసిందే.

రాజకీయ అవినీతిని తుదముట్టించడానికి ఈ 130 వ రాజ్యాంగ సవరణ బిల్లును అమలు లోకి తెస్తున్నామని పదేపదే గొప్పగా చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తమ కనుసన్నల్లో మెలిగే దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడంతోపాటు ఆ సంస్థలపై విశ్వసనీయతను పెంచడానికి ప్రయత్నించాలి. ఇడి వంటి దర్యాప్తు సంస్థలు హద్దులు మీరుతున్నాయని సుప్రీం కోర్టు ధర్మాసనం కూడా అనేకసార్లు మందలించిన సంగతి తెలిసిందే.

గత పదేళ్లలో ఇడి 193 మంది రాజకీయ నాయకులపై కేసులు బనాయించగా, వారిలో కేవలం ఇద్దరికే శిక్షపడడం ఈ సందర్భంగా గమనించవలసి ఉంది. అరెస్టయిన ఆప్ ప్రభుత్వ మంత్రి సత్యేంద్రజైన్ పై సిబిఐ నాలుగేళ్లు దర్యాప్తు జరిపినా చివరకు తేల్చలేక కేసును మూసివేస్తున్నట్టు న్యాయస్థానానికి వెల్లడించడం దర్యాప్తు సంస్థల నిర్వాకానికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో వస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు కేవలం విపక్షాలను టార్గెట్ చేయడానికే అన్న వాస్తవం అంతర్గతంగా తెలుస్తోంది. అంతేకాదు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News