Thursday, July 24, 2025

ఆపరేషన్ సిందూర్‌పై 29న పార్లమెంట్‌లో చర్చ

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై జులై 29న ఉభయ సభల్లో సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై ఎంపీలు మాట్లాడనున్నట్టు ఆంగ్లమీడియా కథనాలు వెల్లడించాయి. బుధవారం జరిగిన పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉగ్రదాడి జరగ్గా, ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీవోకే లోని ఉగ్రశిబిరాలే లక్షంగా మెరుపు దాడులు చేసింది. అత్యంత కచ్చితత్వంలో కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా భారత్ పైకి డ్రోన్లు, క్షిపణలు పంపించింది. దీంతో ఇరుదేశాల మధ్య కొన్ని రోజుల పాటు భీకర ఘర్షణ వాతావరణం నెలకొంది.

అనంతరం పాక్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ముగించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటించుకుంటున్నారు. దీంతో అగ్రరాజ్య ఆరోపణలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరపాలని కాంగ్రెస్‌సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు, పహల్గాం దాడి వెనుక నిఘా వైఫల్యం వంటి ఆరోపణలప భారత ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి. విపక్షాల నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చకు తాజాగా తేదీని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు. మాల్దీవులు, యూకే పర్యటన ముగించుకొని జులై 26న స్వదేశానికి తిరిగొస్తున్నారు. దీంతో జులై 29న లోక్‌సభలో జరిగే చర్చలో ప్రధాని పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News