ఖాకీ బట్టలు వేసుకుని, టిఫిన్ బాక్సు చేతపట్టుకుని, ఫ్యాక్టరీకి వెళ్లిన కార్మికుడు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడో రాడో చెప్పలేని పరిస్థితులు దాపురించాయి. పరిశ్రమలలో తరచూ జరుగుతున్న ఘోర ప్రమాదాలు కార్మికుల ప్రాణాలను కబళిస్తున్నా, పటుతరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరాన ఉన్న పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడులో 36 మంది మరణించారన్న వార్త సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పేలుడుకు కారణాలు ఇప్పటికిప్పుడే తెలియకపోయినా, పలువురి మృతదేహాలు గుర్తించలేని విధంగా మాంసపు ముద్దల్లా మారిపోయాయంటే, పేలుడు ధాటికి కొందరు గాల్లోకి ఎగిరి 30 అడుగుల దూరంలో పడ్డారంటే పేలుడు తీవ్రత ఎంతటి భారీస్థాయిలో ఉందో ఊహించవచ్చు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రివర్యులు, అధికారగణం రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ఉండవచ్చు. భారీయెత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించి ఉండవచ్చు కానీ, పోయిన ప్రాణాలైతే తిరిగిరావు కదా. ప్రమాదం జరిగిందని తెలుసుకుని, తమవారికి ఏమైందోనని గుండెలు బాదుకుంటూ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన కుటుంబాల ఆందోళన చూస్తే, వారి ఆర్తనాదాలు వింటే గుండె తరుక్కుపోక మానదు. మృత్యువాత పడిన కార్మికులలో అత్యధికులు బీహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలనుంచి పొట్టచేతపట్టుకుని వలసవచ్చివారే కావడం మరీ విషాదం. ఇటీవలికాలంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరిట పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు రాయితీలు, మినహాయింపులు ఇచ్చి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం పరిపాటిగా మారింది.
రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు ఇది మంచిదే కావచ్చు. కానీ, సదరు పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఎంతమాత్రం పాటిస్తున్నాయన్న విషయాన్ని పాలక వర్గాలు విస్మరించడం వల్లనే ఇటువంటి ఘోరాలు, దారుణాలు జరుగుతున్నాయి. ఉత్పత్తిని పెంచి, లాభాలు ఆర్జించాలని చూసే యాజమాన్యాలు తమ పరిశ్రమలలో భద్రతా ఏర్పాట్లు కల్పించడాన్ని అదనపు భారంగా భావిస్తున్నాయి. పైగా నైపుణ్యం లేని కార్మికులను పనిలో పెట్టుకుని, వారికి చాలీచాలని జీతాలు ఇచ్చి పని నడిపించడం ఆనవాయితీగా మారిపోయింది. హైరిస్క్ కేటగిరిలోకి వచ్చే ఔషధ, రసాయనిక పరిశ్రమల్లో రియాక్టర్లు, బాయిలర్లు వంటి పరికరాలను నడిపేందుకు నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమన్న ఇంగితాన్ని యాజమాన్యాలు విస్మరిస్తున్నాయి. ఈ పరిస్థితి ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు.
అత్యధిక సంఖ్యలో పరిశ్రమలు గల మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల తీరు ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. కొత్త పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నా, వాటిపై పర్యవేక్షణకు సరిపడా సిబ్బంది నియామకాలు జరగడం లేదన్నది నిష్ఠూర సత్యం. ఉదాహరణకు మహారాష్ట్రలో ఒక ఇన్‌స్పెక్టర్ ఏడాదికి 818 ఫ్యాక్టరీలను తనిఖీ చేయాల్సి వస్తోందని 2021లో జరిగిన ఒక సర్వేలో వెల్లడైంది. అలాగే తమిళనాడులో 499 ఫ్యాక్టరీలను, గుజరాత్‌లో 532 ఫ్యాక్టరీలను తనిఖీ చేయాల్సి వస్తోందట. దీంతో పని ఒత్తిడి భరించలేక, అధికారులు నామమాత్రపు తనిఖీలు జరిపి, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. భాగ్యనగరం నాలుగుమూలలా ఉన్న పరిశ్రమలలో తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతటి ఘోర ప్రమాదం జరిగినా, యాజమాన్యాలు పరిహారమిస్తే చాలనే ధోరణి ప్రబలిపోయింది. సదరు యజమానులను చెరబట్టి, న్యాయస్థానాలలో నిలబెట్టే దిశగా చర్యలు తూతూమంత్రంగానే ఉంటున్నాయి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు చనిపోతే, సదరు యజమానికి 20 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తారు. మన దేశంలోనూ ఇంతటి కఠినమైన చట్టాలకు రూపకల్పన జరగవలసిన అవసరం ఉంది.
రాష్ట్రంలోని పరిశ్రమల్లో ప్రతి రెండు రోజులకు ఒక ప్రమాదం జరుగుతున్నట్లుగా గణాంకాలు ఘోషిస్తున్న నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మేలుకోవాలి. పాశమైలారం దుర్ఘటనతోనైనా కళ్లు తెరిచి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే యాజమాన్యాలకు ముకుతాడు వేసే విధంగా నిబంధనలకు రూపకల్పన చేసేందుకు నడుం బిగించాలి. ఈ క్రమంలో ఇతర దేశాలలో అమలవుతున్న చట్టాలను, తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించాలి. కాలం చెల్లిన యంత్రాలను ఉపయోగించే, నైపుణ్యం లేని కార్మికులతో పని నడిపించే పరిశ్రమలను సీజ్ చేసేందుకు వెనుకాడకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల స్థితిగతులను తెలుసుకునేందుకు నిపుణుల బృందాలను యుద్ధప్రాతిపదికన నియమించవలసిన అవసరాన్ని పాశమైలారం ఘటన చాటిచెబుతోంది. ఈ దిశగా పరిశ్రమల భద్రతపై కమిటీని నియమిస్తామన్న రాష్ట్ర కార్మిక మంత్రి తాజా ప్రకటన హర్షణీయం.