బీహార్‌లో రాజధాని పాట్నాలో పట్టపగలే అక్కడి పరాస్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. క్రైమ్ సినిమాలో మాదిరిగా నలుగురు సాయుధులు అడ్డూ అదుపు లేకుండా సాదాసీదాగా వచ్చి ఐసియూ తలుపులు తెరుచుకుని వెళ్లి బెడ్‌పై చికిత్స పొందుతున్న వ్యక్తిపై కాల్పులు జరిపారు. తరువాత అక్కడి నుంచి ఎటువంటి అడ్డంకి లేకుండా జారుకున్నారు. బెడ్ మీద చికిత్స పొందుతున్న వ్యక్తి నేరస్తుడు, ఓ హత్యకేసులో దోషి. చికిత్స కోసం పెరోల్‌పై వచ్చి ఇక్కడి ఆసుపత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న వేరే గ్యాంగ్ ఏకంగా ఆసుపత్రిలోకి చేరి కాల్పులకు దిగారని వెల్లడైంది. రోగి అయిన తమ శత్రువుపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దశలో తీవ్రంగా గాయపడి ఆ వ్యక్తి తరువాత మృతి చెందాడు.
ఘటనను పాట్నా సెంట్రల్ ఎస్‌పి దీక్షా నిర్థారించారు. పాత కక్షలతోనే ఈ కాల్పుల ఘటన జరిగి ఉంటుందని వివరించారు. దర్యాప్తు జరుగుతోందని , సిసిటీవీ ఫుటేజ్ ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్‌లో ఈ కాల్పుల ఘటన రాజకీయ కలకలం రేపింది. రాష్ట్ర కాంగ్రెస్ తరఫున కాల్పుల ఘటన ఫుటేజ్‌లను సామాజిక మాధ్యమాలలో పొందుపర్చారు. నితీశ్‌కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలో గూండారాజ్యాన్ని పెంచిపోషిస్తోందని , అరాచకం తప్పితే మరోటి లేదని పార్టీ వర్గాలు మండిపడ్డాయి. గడిచిన 17 రోజులలో ఏకంగా 46 హత్యలు జరిగాయి. ఇప్పుడు రాజధాని పాట్నాలో ఆసుపత్రిలోనే హత్యాకాండ జరిగిందని , క్రిమినల్స్ ఆసుపత్రిలోకి దర్జాగా వచ్చి ఓ క్రిమినల్‌ను చంపివేసి వెళ్లారని, ఇంతకంటే అరాచకం ఉంటుందా? అని ప్రశ్నించారు