ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పునఃప్రారంభ సభలో పవన్ మాట్లాడుతూ.. అమరావతి రైతులు ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని నలిగిపోయారన్నారు. రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదని.. రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని చెప్పారు.
“మా కన్నీళ్లు తుడిచేవారెవరని అప్పట్లో రైతులు నన్ను అడిగారు. అమరావతి.. ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టింది. దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారు. అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అమరావతి ప్రపంచస్థాయి రాజధానికి మారుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని మోడీ అమరావతి పునఃనిర్మాణ సభకు వచ్చారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వని కారణంగా గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడింది.20 ఏళ్ల ముందే భవిష్యత్‌ను ఊహించి ప్రణాళికతో ముందుకు వెళ్ల గల నేత చంద్రబాబు” అని పవన్ కల్యాణ్ అన్నారు.