Saturday, August 2, 2025

కాళేశ్వరం నివేదిక అధ్యయనానికి అధికారుల కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ అందజేసిన నివేదికను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అ ధ్యయనం చేసిన అనంతరం అందులోని ప్రధాన అంశాలపై ఈ నెల 4 న జరిగే మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం అందజేసారు. అనంతరం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. కమిషన్ నివేదికపై ఏ విధంగా ముందుకెళ్లాలని చర్చించిన అనంతరం కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నా రు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయ శాఖ సెక్రటరీ, జీఏడి సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి ఈ నెల 4న జరిగే రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసారు.

డిజైన్‌లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలు?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ మొదలు మేడిగడ్డ ఎప్పుడు కుంగింది, ఏం జరిగింది..? ఎవరు బాధ్యులు అన్న విషయాలను కమిషన్ ఈ నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం. బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన కేబినెట్ మీటింగ్ మినిట్స్‌ను ప్రభుత్వం నుంచి తెప్పించుకొని ఈ కమిషన్ పరిశీలించింది. ప్రధానంగా మూడు అంశాలను కమిషన్ ఈ నివేదికలో ప్రస్తావించినట్టుగా తెలిసింది. డిజైన్‌లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించినట్టుగా సమాచారం. హైలెవల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసిట్లు నివేదికలో కమిషన్ ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఐఏఎస్‌లు, ఇంజనీర్ల మధ్య సమన్వయం లోపం, క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్ ఈ నివేదికలో స్పష్టం చేసినట్టుగా తెలిసింది. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసినట్టుగా సమాచారం. ఇలా ఉండగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ గురువారం తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్‌లో అందజేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News