జూన్ 5న కెసిఆర్, 6న హరీశ్, 9న
ఈటల విచారణకు హాజరు కావాలని
నోటీసులు 15రోజుల గడువు ఇచ్చిన
కాళేశ్వరం కమిషన్ తొలుత ఈ నేతల విచారణ
అవసరం లేదని భావించిన ఘోష్ సహజ న్యాయ
సూత్రాలకు విరుద్ధమవుతుందని నిర్ణయంలో మార్పు ఇప్పటికే 200మంది
అధికారులను విచారించిన కమిషన్ వీరిలో 25మంది ఐఎఎస్‌లే హాజరు
కానున్న ఈటల కాళేశ్వరం కుంగుబాటుపై దర్యాప్తు జరుపుతున్న ఘోష్ కమిషన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ నేపథ్యంలోనే మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లు విచారణకు రావాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు జారీచేసింది. వారు హాజరయ్యేందుకు 15 రోజులు గడువును కమిషన్ ఇచ్చింది. కమిషన్ ఎదుట హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జస్టిస్ పిసి ఘోష్ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 5వ తేదీన కెసిఆర్, 6వ తేదీన హరీష్‌రావు, 9వ తేదీన ఈటల రావాలని కమిషన్ ఈ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణం వ్యవహారంలో ని జాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా 2024, మార్చిలో జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు అయ్యింది. దాదా పు పద్నాలుగు నెలలుగా ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా, కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండునెలల (జూలై 31) వరకు పొడిగించింది.
ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం 7 సార్లు ఈ కమిషన్ గడువును పొడిగిస్తూ వస్తున్న ది. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను సైతం ఈ కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ విచారణలో భాగంగా డిపిఆర్‌లు ఒకలా, క్షేత్రస్థాయిలో నిర్మాణాలు మరోలా ఉన్నాయని కమిషన్ నిర్ధారించుకుంది. పనుల్లో నాణ్యత లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నాయని కూడా కమిషన్ ఓ నిర్ధారణకు వచ్చింది. ఎన్డీఎస్‌ఏ, కాగ్, విజిలెన్స్ రిపోర్టులను సైతం కాళేశ్వరం కమిషన్ పరిశీలించింది. ఈ నిర్మాణ పనులు జరిగేటప్పుడు రోజు వారీ రికార్డులను నిర్వహించలేదని ఇంజనీర్లపై సైతం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారు?
ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా ఈ కమిషన్ విచారించింది. అలాగే ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ పిలిపించి విచారణ చేపట్టింది. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని ప్రశ్నించగా ప్రధానంగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రముఖుల పేరునే అధికారులు ప్రస్తావించినట్లుగా సమాచారం. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రే ముఖ్యపాత్ర పోషించినట్టుగా అధికారులు కమిషన్‌కు ఆధారాలు అందచేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది.
25 మంది మాజీ ఐఏఎస్‌లతో పాటు ప్రస్తుత ఐఏఎస్‌లు
సుమారు 200 మంది అధికారులను కమిషన్ విచారించగా అందులో 25 మంది మాజీ ఐఏఎస్‌లతో పాటు ప్రస్తుత ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. వీరితో పాటు నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీకంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులను కూడా కమిషన్ విచారించింది. ఇప్పటివరకు కమిషన్ పలువురిని విచారించి వారు అందించిన వివరాలతో ఓ నివేదికను కూడా సిద్ధం చేసింది. దీంతో మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే వారికి నోటీసులు పంపించింది. దీంతో ఇప్పుడు కమిషన్ నిర్ధేశించిన విధంగా కెసిఆర్ విచారణకు హాజరవుతారా లేక, న్యాయపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తారా అన్నది కీలకంగా మారబోతోంది. అయితే కెసిఆర్, హరీష్, ఈటలకు నోటీసుల జారీతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈటల ఈ విచారణకు హాజరవుతారని ఆ పార్టీ నేతలు పేర్కొనగా కెసిఆర్, హరీష్‌రావులు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠగా మారింది.