నెలాఖరులో ప్రకటన
సామాజికవర్గాల వారీగా కసరత్తు
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్‌సి,
ఎస్‌టి, మైనారిటీలకు అవకాశం?
మంత్రివర్గ విస్తరణపైనా చర్చలు
మాదిగలకు ప్రాతినిధ్యంపైనే
పీటముడి వచ్చే నెలలో కేబినెట్
విస్తరణకు ఛాన్స్ అగ్రనేత
కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్,
పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
భేటీ, గంటపాటు చర్చలు
నేడు రాహుల్‌గాంధీ, రేపు ఎఐసిసి
చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం
మరో రెండు రోజులు ఢిల్లీలోనే
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: పీసీసీ కార్యవర్గం ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు ఆ పార్టీ వర్గాల తాజా సమాచారం. ఈ నెలాఖరున పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణను కూడా అధిష్ఠానం తేల్చేపనిలో ఉన్న ట్టు తెలిసింది. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా వీరి మధ్య చర్చలు సాగాయి. రేవంత్‌తో పాటు పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు.
సోమవారం ఉదయం వేణుగోపాల్‌తో కలిసి రాహుల్‌గాంధీని కూడా సీఎం రేవంత్‌రెడ్డి కలువనున్నారని తెలిసింది. అలాగే మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే అపాయింట్‌మెంట్ లభించడంతో మరో రెండు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే పీసీసీ కార్యవ ర్గం ఎంపికపై తమ ప్రతిపాదనలను పార్టీ పెద్దల ముందు ఉంచినట్టు తెలిసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిసి కార్యవర్గం ఎంపి క ప్రతిపాదనలపై మహేశ్‌కుమార్‌గౌడ్ చర్చించినట్టు తెలిసింది.
పీసీసీ అధ్యక్షుడు, అధిష్ఠానం సంయుక్తంగా చేసిన కసరత్తుపై తుదిగా సీఎం రేవంత్‌రెడ్డితో అధిష్ఠానం చర్చించాక, పీసీసీ కా ర్యవర్గం, మంత్రివర్గ విస్తరణ రెండింటిపై స్పష్టత రానున్నదని ఈ వర్గాల సమాచారం. పీసీసీ కా ర్యవర్గం ఖరారు దాదాపు ఒక కొలిక్కి రావడంతో ఈ నెలాఖరున ప్రకటించే అవకాశం ఉన్నట్టు తె లిసింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఈ మూడు పదవులలో ఉన్న సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ లో, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభించని సామాజిక వర్గాలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పించబోతున్నట్టు తెలిసింది. ఎస్టీ, ఎస్సీ (మాదిగ), మైనార్టీ ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన వారికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం దక్కబోతున్నట్టు తెలిసింది. అలాగే కార్యవర్గంలో కీలకమైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేసినట్టు తెలిసింది.
వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ?
పీసీసీ కార్యవర్గం ఎంపిక కొలిక్కి రావడంతో పార్టీ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణపై ఇక దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ నెలఖారున పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించి, వచ్చే నెల జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం సూచనప్రాయంగా అంగీకరించినట్టు ఈ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే అంశం వల్లనే జాప్యానికి కారణంగా చెబుతున్నారు.
డిప్యూటీ సీఎం, స్పీకర్ రెండు కీలక పదవులు మాల సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో కనీసం మంత్రివర్గంలో అయినా తమకు ప్రాధాన్యత కల్పించాలని మాదిగ సామాజిక వర్గం చేస్తోన్న డిమాండ్‌ను అధిష్ఠానం సీరియస్‌గా తీసుకొని ఆ దిశగా కసరత్తు చేస్తోన్నట్టు తెలిసింది. మంత్రివర్గంలో ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి దామోదర రాజనరసింహకు ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ ఆయన తమ సామాజిక వర్గం కాదని ఆరుగురు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల వాదనతో అధిష్ఠానం ఏకీభవించినట్టు తెలిసింది. దీంతో మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై సందిగ్థత నెలకొన్నట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఆరుగురు మాదిగ ఎమ్మెల్యేలు మరోసారి తమ డిమాండ్‌పై అధిష్ఠానంతో చర్చించాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. మరోవైపు అధిష్ఠానం పెద్దలకు కూడా లిఖిత పూర్వకంగా వారు లేఖ రాసారు.
మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందే
మంత్రివర్గ విస్తరణలో తమ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ సిఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ అందజేసిన విషయం తెలిసిందే. వీరిలో ఎమ్మెల్యేలు మందుల సామేల్ (తుంగతుర్తి), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), వేముల వీరేశం (నకిరేకల్), తోట లక్ష్మీకాంతరావు (జుక్కల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), కాలె యాదయ్య (చేవెళ్ల)లు ఉన్నారు. తమ కోటాలో మంత్రివర్గంలో ఉన్న దామోదర రాజనర్సింహ మాదిగ కాదని, ఆయనది ఉపకులమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గ జనాభా రాష్ట్రంలో 2011 జనగణన ప్రకారం 33 లక్షల మంది ఉన్నారని, మాలలకు డిప్యూటీ సిఎం, స్పీకర్ పదవి దక్కడంతో మంత్రివర్గంలో అయినా తమకు చోటు కల్పించాలని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.