Monday, July 7, 2025

పేలుడు పదార్థాల కేసులో పిసిసి నేత అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /కామారెడ్డి క్రైమ్: పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్ సరఫరా కేసులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లా కేంద్రంలో అతని నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిజామాబాద్ జైలుకు అతనిని తరలించారు. ఈ కేసులో చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు గడ్డం సూర్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి పట్టణంలోని కెసిఆర్ కాలనీలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికీ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారు ఈ పేలుడు పదార్థాలను పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుంచి తెచ్చుకున్నట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో
చంద్రశేఖర్ రెడ్డిని నేరుగా అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రస్తుతం ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

పేలుడు పదార్థాలతో నా భర్తకు సంబంధమే లేదు: మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ స్పష్టీకరణ
కామారెడ్డి పట్టణంలో లభించిన పేలుడు పదార్థాలతో తన భర్తకు సంబంధం లేదని పిసిసి జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ స్పష్టం చేశారు. సంబంధం లేని కేసులో తన భర్తను అరెస్ట్ చేశారని వాపోయారు. కామారెడ్డిలోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంతో తమ కష్టానికి గుర్తింపుగా తన భర్తకు పిసిసి జనరల్ సెక్రెటరీగా అవకాశం ఇచ్చారని అన్నారు. పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. అయితే, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని పేర్కొన్నారు. శ్రీవారి వెంచర్‌కు,తమకు సంబంధం లేదన్నారు. మూడు రోజుల క్రితం ప్రోబెల్స్ స్కూల్ సమీపంలో దొరికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్‌కు ముడిపెడుతున్నారని మండిపడ్డారు. శ్రీవారి వెంచర్‌లో తన భర్తకు గుంట భూమి కూడా లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 9:30 గంటలకు ఫోన్ రాగానే తన భర్త ఇంటి నుంచి వెళ్లారని, 11 గంటలకు అతనిని అరెస్ట్ చేస్తున్నట్లు తనకు ఫోన్ వస్తే వెళ్లానని పేర్కొన్నారు.

ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్ట్‌లా?
తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అరెస్ట్ చేశారని ఇందుప్రియ పేర్కొన్నారు. బిచ్కుంద కోర్టు వద్ద రిమాండ్ చేశారని వివరించారు. అక్కడి నుంచి నిజామాబాద్ సారంగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News