పెబ్బేర్: వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలంలోని రంగాపూర్ లో గణేష్ శోభాయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం చేసుకొని వెళ్తుండగా ట్రాక్టర్ ను డిసిఎం ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. నాచహళ్లి గ్రామానికి చెందిన 13 మంది యువకులు గురువారం రాత్రి 11 గంటలకు శోభాయాత్ర చేపట్టారు. వనపర్తి మండలం బీచుపల్లి దగ్గర గణేష్ నిమజ్జనం చేసి అనంతరం తిరిగి ట్రాక్టర్ లో తన సొంతూరుకు బయలు దేరారు.
Also Read: హైదరాబాద్ ఫీవర్
రంగాపూర్ గ్రామ శివారులోకి రాగానే శుక్రవారం తెల్లవారుజామున 01:35 గంటల సమయంలో ట్రాక్టర్ ను వెనుక నుంచి డిసిఎం అతివేగంగా ఢీకొట్టింది. ట్రాక్టర్ ఇంజన్ పై కూర్చున్న ఐదుగురు కిందపడ్డారు. ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సాయి(25), శంకర్(28)గా గుర్తించారు. ప్రస్తుతం డిసిఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.