మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి పేర్ని నానికి ఎపి హైకోర్టులో ఊరట లభించింది. కృష్ణా జిల్లా పామర్రులో ఆయన రప్పా రప్పా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో ఆయననను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో మరో వైసీపీ నేత కైలే అనిల్‌తో కలిసి పేర్నినాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. తమ పట్ల పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పేర్నినాని అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం పోలీసులకు కీలక సూచనలు చేసింది. పేర్నినానితో పాటు కైలే అనిల్ పట్ల తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన వైసిపి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలను ఉద్దేశించి రప్పా రప్పా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పలువురు టిడిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. త్వరలో చర్యలు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు.