Tuesday, July 29, 2025

ఎంఎల్ఎ మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించిన ఫార్మా బాధిత రైతులు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో ఫార్మా భూములపై ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటిని రైతులు ముట్టడించారు. దిల్‌షుక్‌నగర్‌లోని తిరుమలహిల్స్‌లోని ఎమ్మెల్యే ఇంటి ముందు యాచారం మండలానికి చెందిన 300 మంది బాధిత రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్లే కార్డులు పట్టుకుని రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి,ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద నినాదాలు చేస్తూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చేవరకు ఇక్కడినుంచి వెళ్లేదిలేదని నిరసనకు దిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేస్తామని, ఫార్మా బాధిత రైతులకు భూములను తిరిగి ఇస్తామని ఎమ్మెల్యే రంగారెడ్డి హామీ ఇచ్చారని,అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా

నేటికి సమస్యలను పరిష్కరించలేదని రైతులు ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ఫార్మాకు ఇవ్వని 2500 ఎకరాల భూమిని తిరిగి రైతుల పేరును ఆన్‌లైన్‌లో ఎక్కించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూములను వెంటనే తొలగించాలన్నారు.రైతులకు రైతు భరోసా,రైతు బీమా,పంట రుణం,రుణమాఫీలతో పాటు తమ భూములను అమ్ముకునేందుకుగాను రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియకు అనుమతించాలని రైతులు డిమాండ్ చేశారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కె.సరస్వతి, నాయకులు గణేష్,సామ నిరంజన్,నారాయణ,విష్ణువర్థన్‌రెడ్డి,మహిపాల్‌రెడ్డి,సందీప్‌రెడ్డి తదితరులతో పాటు మండలంలోని ఫార్మా బాధిత రైతులు భారీ ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News