తియాంజిన్ (చైనా) : జపాన్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాత్రి చైనాకు చేరుకున్నారు. ఆదివారం నుంచి రెండురోజుల పాటు ఇక్కడి తియాంజిన్‌లో జరిగే చైనా ప్రతిష్టాత్మక షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) వార్షిక సదస్సులో పాల్గొనడమే ప్రధాని మోడీ పర్యటన ప్రధాన ఉద్ధేశం. అయితే ఈ నేపథ్యంలోనే చైనా అధినేత జి జింపింగ్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం, అమెరికా టారీఫ్‌లు, మార్కెట్ల ఒడుడుడుకుల క్రమంపై చర్చలు జరపడం, సమీక్షించుకోవడం భారత్‌కు అత్యంత ప్రధాన విషయం అయింది. ఆదివారం, సోమవారం షాంఘై సదస్సు జరుగుతుంది. ఇక్కడికి రష్యా అధినేత పుతిన్ రావడం కూడా కీలకం అయింది. ప్రత్యేకించి ఆదివారం చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో ప్రధాని భేటీకి రంగం సిద్ధం అయింది.
ఈ రోజే షాంఘై సదస్సు విస్తృత స్థాయి సంప్రదింపులు కూడా జరుగుతాయి. 2020లో లద్థాఖ్‌లో భారత్ చైనా సైనికుల ఘర్షణలు, సంబంధాల మధ్య ప్రతిష్టంభన క్రమేపీ సమసిపోవడం జరిగింది. ఏడేళ్ల తరువాత ప్రధాని మోడీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. జపాన్‌లోనే అక్కడి ప్రధాన పత్రికకు ప్రధాని మోడీ శుక్రవారం ఇచ్చిన ఇంటర్వూలో భారత్ చైనా పటిష్ట బంధం అత్యవసరం అని, ఈ ప్రాంతం, పరస్పరమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పటిష్ట బంధం మైలురాయి అవుతుందని తెలిపారు.
చైనా భారత్ నేతల మధ్య సంప్రదింపుల పైనే ప్రపంచం దృష్టి కేంద్రీకృతం అయింది. ఇక్కడి పరిణామాలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. జిన్‌పింగ్‌తో చర్చల దశలో ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు దిశలో అంగీకారానికి వీలుంది. ఇక అమెరికా మార్కెట్ ప్రతిబంధకాల దశలో భారతీయ సరుకులకు చైనా మార్కెట్ అవకాశాలపై కూడా సమీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. తియాంజిన్ సమ్మిట్‌లోనే పలువురు నేతలతో చర్చల సందర్భంగా ట్రంప్ సుంకాల విషయంపై కూడా ప్రధాని సమీక్షించే అవకాశం ఉంది. చాలా వ్యూహాత్మక పరిణామాల తరువాతనే చైనాలో ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. పదిహేను రోజుల క్రితమే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌లో పర్యటించి వెళ్లారు. విదేశాంగ మంత్రి జైశఃకర్‌తో, జాతీయ భద్రతా సలహదారు అజిత్ ధోవల్‌లో చర్చించారు.ఈ క్రమంలోనే చైనా షాంఘై సదస్సుకు మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యల పరిష్కారం దిశలో ఇప్పటికే కుదిరిన సైనికాధికారుల స్థాయి అంగీకారాలను అమలు చేయడం ద్వారా ఇకపై వివాదాలు తలెత్తకుండా చేసేందుకు కూడా చైనా, భారత్ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ప్రధాని మోడీ 2018లో చైనాలో షాంఘై సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. మరుసటి సంవత్సరం చైనా అధినేత జిన్‌పింగ్ భారత్‌కు వచ్చి వెళ్లారు.ఈ రెండు సందర్భాలలోనూ ఇరువురు నేతల మధ్య ఇష్టాగోష్టిగా పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. తరువాతి దశలో సరిహద్దు ఘర్షణల నివారణకు మార్గం ఏర్పడింది. భారత్ చురుకైన ప్రాతినిధ్యం క్రమంలో షాంఘై సదస్సు నుంచి అమెరికా టారీఫ్‌లపై సమన్వయ రీతిలో వ్యూహాత్మక చర్యలకు అధికారికంగా కానీ లేక అంతర్గత స్థాయిలో కానీ అంగీకారం కుదిరేందుకు వీలుందని విశ్లేషిస్తున్నారు. చైనా ఉత్తరప్రాంతంలో ఉన్న తియాంజిన్ బోహాయి సముద్ర తీరంలోని పెద్ద పట్టణం.రష్యా, టర్కీ , ఇరాన్, పాకిస్థాన్ ఇతక దేశాధినేతల ఆగమనంతో ఇక్కడనే రష్యా ఉక్రెయిన్ యుద్ధ నివారణ విషయాలు కూడా ప్రస్తావనకు వస్తాయని అంతర్గత అజెండాలో స్పష్టం అయింది.