దేశ తొలి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని ఉంటే భారత్‌లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదని, ప్రధాని మోడే పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌కు వెళ్లిన ఆయన , మంగళవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్‌ఉగ్రదాడులతో భారత్‌లో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. “ ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోంది. దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాక్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరయ్యి, ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. ఆ దేశ ఆర్మీ కూడా వారికి సెల్యూట్ చేసింది. ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం కాదని, పాకిస్థాన్ యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తోంది. దానికి తగినట్టే స్పందిస్తాం.
భారత్ ఎవరితోనూ యుద్ధ కోరుకోవట్లేదు. మేము శాంతంగా ఉండటంతోపాటు ఇతరులు అలాగే ఉంటారనుకుంటాం. కానీ పరోక్ష యుద్ధంతో మా బలాన్ని పరీక్షిస్తే సహించేది లేదు ” అని మోడీ పేర్కొన్నారు. 1947 నాటి భారత విభజన గురించి మోడీ సభలో ప్రస్తావించారు. 1947లో భారత్ రెండు ముక్కలైంది. అదే రోజు రాత్రి కశ్మీర్‌లో తొలిసారి ఉగ్రదాడి జరిగింది. సాయుధ మూకల సాయంతో కశ్మీర్ లోని కొంత బాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. ఆ రోజున ఉగ్రవాదులను ఏరివేసి, ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహా విని ఉంటే. భారత్‌లో ఉగ్రదాడుల పరంపర కనిపించేది కాదు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ మాట వినలేదు. అప్పటి నుంచి పర్యాటకులు, యాత్రికులు, పౌరుల లక్షంగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. పహల్గాంలో జరిగింది కూడా అందుకు ఉదాహరణ ” అని మోడీ వెల్లడించారు.