ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ వివరాలపై కేంద్రీయ సమాచార కమిషన్ (సిఐసి) ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ప్రధాని మోడీ . డీగ్రీ వివరాలను తమ ఫిర్యాదీ నీరజ్‌కు తెలియచేయాలని 2016లో సిఐసిఢిల్లీ యూనివర్శిటీ అధికారులకు తెలిపింది. ఈ వ్యవహారం చాలా ఏండ్లుగా పాగుతూ వస్తోంది. సిఐసి ఆదేశాలను వర్శిటీ అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న జస్టిస్ సచిన్ దత్తా తీర్పును రిజర్వ్ చేశారు. డియూ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిఇసి కమిషన్ ఆదేశాలను కొట్టివేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ప్రధాని మోడీ 1978లో బిఎ పరీక్ష రాసి డిగ్రీ పూర్తి చేశారు. ఆర్టీఐ దరఖాస్తు మేరకు ఈ ఏడాదిలో డిగ్రీ పూర్తి చేసిన వారందరి వివరాల పరిశీలనకు అనుమతించారు. కోర్టుకు వివరాలు అందించేందుకు యూనివర్శిటీకి అభ్యంతరం లేదని,
అంతే కానీ విద్యార్థుల వ్యక్తిగత అంశంతో ముడివడి ఉండే డిగ్రీ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని, సిఐసి ఆదేశాలను నిలిపివేయాలని డియూ కోరింది. రిజర్వ్ చేసిన తీర్పు ఇప్పుడు వెలువడింది. కాగా ప్రధాని డిగ్రీ వివరాలను, ఆయన విద్యాసంబంధిత సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకు రావడం ప్రజా సమాచారం కోణంలో సబబే అని ఈ కేసు వివాదం దశలో ఆర్టీఐ ఉద్యమకారులు పట్టుపట్టారు. అయితే సమాచార హక్కు పరిధిలో అన్ని తెలుసుకునే ఆసక్తి అధికారం సక్రమమే కానీ ఈ క్రమంలో వ్యక్తిగత సమాచారం , చదువు ఇతరత్రా వివరాలను పరిరక్షించడం అనే అంశం కూడా ఉంటుందని , ఇతరుల ఆసక్తి మేరకు వ్యక్తుల డిగ్రీ వివరాలను అందరితో పంచుకోవల్సిన అవసరం లేదని, సమాచార వెల్లడి ఎంత ముఖ్యమో సమాచార గోప్యత పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఢిల్లీ యూనివర్శిటీ తెలియచేసింది.