దేశవ్యాప్తంగా 16వ రోజ్‌గార్ మేళా ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, గుంతకల్లు, గుంటూరుతో సహా జాతీయ స్థాయిలో 47 ప్రదేశాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 16వ రోజ్‌గార్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేరబోతున్న 51వేలకుపైగా ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రోజ్‌గార్ మేళాలో భాగంగా సికిందరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు కొత్తగా ఎంపికైన 114 మందికి నియామక పత్రాలను భోయిగూడలోని రైల్ కళారంగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఇతర ప్రముఖుల సమక్షంలో అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి,
సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, రైల్వేలు , ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా దేశానికి సేవ చేసే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన నూతన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. రోజ్‌గార్ మేళా కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రోజ్‌గార్ మేళాల ద్వారా సుమారు 10.50 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశ్వకర్మ యోజన, ఆయుష్మాన్ భారత్ పథకం, ముద్ర యోజన వంటి వివిధ పథకాల గురించి వివరించారు.
ప్రపంచంలోనే లోకోమోటివ్ ఉత్పత్తిలో నంబర్ 1గా ఉండటంతో సహా వివిధ విభాగాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని అన్నారు. కొత్తగా నియమితులైన వారు నిబద్దతతో పనిచేయాలని, ప్రజలకు, దేశానికి సేవ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. వారికి మంచి విద్యను అందించడానికి కష్టపడి పనిచేసిన వారి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన వారిని ప్రోత్సహించారు. సేవా దృక్పథంతో ఉండండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి అని ఆయన సూచించారు. అంతకు ముందు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్ర మాట్లాడుతూ యువతరానికి ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం చేపట్టిన గొప్ప చొరవ ఈ ‘రోజ్‌గార్ మేళా‘ 16వ విడతను నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలో, రైల్వేలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మొదలైన వాటిలో ఈ రోజు 200 మంది నియామక పత్రాలను అందుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.