పహల్గామ్ ఉ్రగవాద దాడికి ధీటైన సమాధానం ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో మరోసారి అధికారులతో ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహన్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. భారత్ సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని..ఉగ్రవాదం లేకుండా చేస్తామని అన్నారు. ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇస్తామన్నారు. సైన్యమే స్థలం, టైమ్ చూసి జవాబిస్తుందని.. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోడీ తెలిపారు.
కాగా, ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. జమ్మూకశ్మీర్ భద్రతపై 40 నిమిషాల పాటు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో భద్రతా చర్యలపై రేపు కేంద్రం సమీక్షించనుంది.