పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం
ప్రతిన నెరవేరినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నాం
ఆపరేషన్ సిందూర్ ఆపమని ఏ దేశమూ చెప్పలేదు
బులెట్‌కు బులెట్‌తోనే సమాధానమిస్తామని వాన్స్‌కు స్పష్టంగా చెప్పా
పాక్ డిజిఎం బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్ ఆపాం
మీ తప్పిదాల వల్లే పిఓకె, కచ్చతీవు కోల్పోయాం
సింధూ జలాల ఒప్పందంలో తప్పిదాలను సరి చేస్తున్నాం
కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు
ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చకు సుదీర్ఘ సమాధానం
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్ విజయోత్సవాలను చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం, భారత సేనల శౌర్య ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుం టున్నామన్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులకు గట్టి సమాధానమిస్తామని ప్రతిజ్ఞ చేశామని, 140 కోట్ల మంది భారతీయులకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో వాడీ వేడిగా జరిగిన చర్చకు మంగళవారం ప్రధాని సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఓ వైపు ఆపరేషన్ సిందూర్‌ను గట్టిగా సమర్థిస్తూనే మరో వైపు ప్రతిపక్షాలు తనపైన, ప్రభుత్వంపైన చేసిన విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టారు. కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేసిన మోడీ ఈ విషయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల తీరుపైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
బులెట్‌కు బులెట్‌తోనే సమాధానమని వాన్స్‌కు చెప్పా
‘ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ప్రపంచంలో ఏ దేశ నేత కూడా మాకు చెప్పలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారు. అదేగనుక జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని వాన్స్‌కు స్పష్టం చేశా. పాక్‌కు ఎవరు సాయం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని కూడా చెప్పా. పాక్ ఎలాంటి దాడి చేసినా చూసుకుంటామని, బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని వాన్స్‌కు చెప్పాం. అన్నట్లుగానే పాక్‌కు చిరకాలం గుర్తుండిపోయేలా సమాధానమిచ్చాం. పాక్ డిజిఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం’ అని ప్రధాని చెప్పారు.
190 దేశాల మద్దతు
మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గాం దాడులు. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలుపుతామని ప్రతిన బూనాం. ద్రోహులను కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని చెప్పాం. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష భేటీలోనూ చర్చించాం. పాక్ భూభాగంలోకి వెళ్లి కీలక ఉగ్రస్థావరాలను ధ్వంపం చేశాం. కలుగులో దాగిన ఉగ్రవాదులను బైటికి లాగి మరీ మట్టుబెట్టాం. మన బలగాల దెబ్బకు పాక్ ఎయిర్‌బేస్‌లు ఇప్పటికీ ఐసియులో ఉన్నాయి.అణు బాంబుల బ్లాక్‌మెయిలింగ్ ఇకపై చెల్లదని పాక్‌ను హెచ్చరించాం. 193 దేశాల్లో 190 దేశాలు అపరేషన్ సిందూర్‌ను సమర్థించాయి. పాక్‌కు కేవలం మూడు దేశాలే మద్దతు ఇచ్చాయి.అని ప్రధాని అన్నారు.
పాక్‌ను కాంగ్రెస్ వెనకేసుకు రావడం దౌర్భాగ్యం
‘ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుబడుతోంది. స్వార్థ రాజకీయాల కోసంసైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోంది.తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. వాళ్లు మీడియా హెడ్‌లైన్స్‌లో ఉండవచ్చునేమో కానీ ప్రజల మనసులను గెలవలేరు. పాక్‌ను కాంగ్రెస్ వెనకేసుకు రావడం దౌర్భాగ్యం. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోను, పైలట్ అభినందన్ పాక్‌కు చిక్కినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. అభినందన్‌ను మోడీ ఎలా తెస్తారో చూస్తామన్నారు. మేము ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చాం. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకొంటోంది. మొదట పాక్‌ను సమర్థించిన విపక్షాలు ప్రజల మూడ్‌ను చూసి ప్లేట్ ఫిరాయించాయి. మాకు భారత రక్షణ దళాల సామర్థంపై నమ్మకం ఉంది. వాటికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. నేనెప్పుడూ భారత ప్రజల పక్షమే. ఆపరేషన్ సిందూర్ సమయంలో నాపై నమ్మకం ఉంచినందుకు దేశ ప్రజలకు రుణపడి ఉన్నా’ అని ప్రధాని మోడీ అన్నారు.
పిఓకె, కచ్చతీవులను అప్పగించింది మీరు కాదా?
కాగా గత కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పిదాలకు ఇప్పటికీ దేశం మూల్యం చెల్లిస్తోందని ప్రధాని దుయ్యబట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్( పిఓకె)ను, కచ్చతీవులను అప్పగించింది మీరు కాదా అని కాంగ్గ్రెస్ నేతలనుద్దేశించి మోడీ ప్రశ్నించారు. నెహ్రూ హయాంలో సింధూ జలాల ఒప్పందం విషయంలో జరిగిన తప్పిదాన్ని ఇప్పుడు సరిచేస్తున్నామన్నారు.
పాక్ మళ్లీ దుశ్చర్యలకు పాల్పడితే..
పాకిస్థాన్ మరోసారి ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా సమాధామిస్తాం’ అని హెచ్చరించారు.
అర్ధరాత్రిదాకా రాజ్యసభ
మరో వైపు రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ అర్ధరాత్రిదాకా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలోలాగే రాజ్యసభలో కూడా ఆపరేషన్ సిందూర్‌పై 18 గంటలు చర్చ జరపాలని ముందు నిర్ణయించారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ అంశంపై చర్చ మొదలు కాలేదు. ఈ కారణంగా రాజ్యసభ అర్ధరాత్రిదాకా కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.