Thursday, September 11, 2025

మోహన్ భగవత్‌కు 75 ఏండ్లు.. ప్రత్యేక వ్యాసంతో మోడీ విషెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన సంచాలకులు మోహన్ భగవత్ గురువారంతో తమ 75వ సంవత్సరంలోకి ప్రవేశించారు. అత్యంత ప్రధానమైన ఈ హిందూత్వ సంస్థ సారధ్య బాధ్యతల్లో ఉన్న భగవత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ , అధికార ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాల నేతలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సర్‌సంఘ్‌చాలక్‌గా ఆర్‌ఎస్‌ఎస్ సారధ్య బాధ్యతల్లోని వారిని వ్యవహరిస్తారు. ఆయన నాయకత్వ పటిమను ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రత్యేకంగా ఆయన కార్యదక్షతను కొనియాడుతూ ప్రధాని పేరిట వెలువడ్డ వ్యాసం కొన్ని పత్రికలలో వెలువడింది. వసుధైవ కుటుంబకం ఆదర్శ వ్యక్తిత్వం మెహన్ భగవత్ సొంతం అని ప్రధాని కొనియాడారు. 2009 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌కు భగవత్ సంచాలకులుగా ఉంటూ వస్తున్నారు. ఇది ఇప్పుడు ఆయన జన్మదిన వజ్రోత్సవం కావడంతో పలువురు బిజెపి నేతలు అభినందనలు వెలువరించారు.

సంఘ్ పరివార్‌ను విస్తరింపచేసుకుంటూ, చివరికి ఇది మైనార్టీల ఆలోచనల్లోకి కూడా చేరుకునేలా చేసేందుకు మోహన్ భగవత్ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రముఖులు ప్రశంసించారు. అధికారంలో ఉన్న బిజెపికి, సంస్థకు మధ్య సరైన సమన్వయం సాధిస్తూనే, అవసరం అయినప్పుడు పాలకపక్షానికి కూడా చురకలు పెడుతూ నిర్మాణాత్మక రీతిలోనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతకు ముందు వాజ్‌పేయి హయాంలో బిజెపి సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వ చలామణి తరువాతి దశలో 2004లో మోడీ సారధ్యంలో బలీయమైన బిజెపి సారధ్య ప్రభుత్వం వచ్చినదశలోనూ మోహన్ భగవత్ సమన్వయ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. సేవాభావన ప్రధాన అంతర్లీన ఉద్ధేశంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా 32 వరకూ సంస్థలు కూడా ఉన్నాయి. విద్యా, కార్మిక, యువజన సంబంధిత అనుబంధ సంస్థలను బలోపేతం చేయడం, సరైన సమన్వయం కొనసాగించడం మోహన్ భగవత్ నాయకత్వ లక్షణానికి గీటురాయి అయింది. ప్రత్యేకించి ఆర్‌ఎస్‌ఎస్ బయటి ప్రపంచంతో, మార్పులు చేర్పులతో ప్రమేయం లేకుండా ఉంటోందనే అభిప్రాయాన్ని దూరం చేయడంలో మోహన్ భగవత్ కీలక పాత్ర పోషించారు.

ఇతర మతాల మనోభావాలను కూడా గౌరవించాల్సి ఉందనే పిలుపుతో ఆయన కీలక సందేశాలు వెలువరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి మసీదు కింద ఓ శివలింగం ఉంటుందనుకోరాదు. అదే విధంగా ప్రతి భారతీయుడి డిఎన్‌ఎ ఒకే విధంగా ఉండాలని భావించరాదని చెప్పిన దశలో ఆయన ఈ సంస్థకు సరికొత్త రూపం తీసుకువచ్చే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలతో సంస్థను మమేకం చేసే యత్నాలు సాగించారు, ఆర్‌ఎస్‌ఎస్ పట్ల అనుమానాస్పద చూపులతో ఉన్న ముస్లిం మైనార్టీల వైఖరిని సంస్థ పట్ల మార్చేందుకు పాటుపడ్డారని బిజెపి విశ్లేషకులు తెలిపారు. అంతకు ముందు సంస్థలు పలు బాధ్యతలు స్వీకరించి , దేశమంతటా పనిచేసిన అనుభవం పొందిన ఆయన అంతకు ముందు ఈ స్థానంలో ఉన్న కె సుదర్శన్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. విజయదశమి తో ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి నేపథ్యంలో మోహన్ భగవత్ సారధ్యం కీలకం అయింది. భగవత్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జెపి నడ్డా, పలువురు ఇతర మంత్రులు , సంఘ్ ప్రముఖులు శుభాకాంక్షలు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News