అసోం పర్యటనలో బహిరంగ సభలో ఉతికేసిన ప్రధాని
అంగుళం భూమి కబ్జా కాకుండా చేసి తీరుతాం
అసామీ భూమిపుత్రులను గేలిచేయడం అనుచితం
డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈశాన్యానికి దక్కిన మేలు
మంగళ్‌డోయ్ : కాంగ్రెస్ పార్టీ భారతీయ సైన్యానికి మద్దతు పలకడం మానివేసి, పాక్ ఉగ్రవాదులకు జై కొడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఆదివారం అసోంలోని దార్రాంగ్ జిల్లాలోని మంగళ్‌డోయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరి విచిత్రంగా ఉంటోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ పెంచిపోషిస్తోన్న ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఎం సంకేతాలు ఇవ్వాలనుకొంటోందని ప్రశ్నించారు. పేరుకు అతి పురాతన పార్టీ , దేశం గురించి, ఇక్కడి మన సైనికుల గురించి ఆలోచించకుండా, ఎంతసేపూ పాక్‌కు వంత పాడుతోందని ప్రధాని మండిపడ్డారు. జాతి వ్యతిరేక శక్తులకు, చొరబాటుదార్లకు మద్దతు పలుకుతోందని విమర్శించారు. మన సరిహద్దుల్లోకి ఏ దిక్కు నుంచి అయినా చొరబాటుదార్లను బిజెపి అడ్డుకుంటుందని హెచ్చరించారు. వారు ఇక్కడికి వచ్చి, ఇక్కడి నేలను ఆక్రమించుకుని, నైసర్గిక స్వరూపాన్ని మార్చివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదంపై పోరులో అత్యంత కీలక ఘట్టం.
ఈ దశలో భారతీయత పట్ల అభిమానం ఉంటే ఎవరైనా మన సైన్యానికి మద్దతు పలకాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు అసలు ఈ చర్యనే తప్పుపట్టారు. మన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించారని చెప్పారు. పాకిస్థాన్‌లోని కరడుగట్టిన ఉగ్రవాదులను తుదముట్టించడంలో మన సైన్యం సాగించిన సిందూర్ దశలో కాంగ్రెస్ వైఖరి దారుణంగా ఉందని విమర్శించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై జాతి వ్యతిరేక ఆరోపణలకు దిగారు. ఆపరేషన్ సిందూర్ ఈ ప్రాంతంలోని మా కామాఖ్య చల్లని దీవెనలతో విజయవంతం అయిందని తెలిపారు. ఈ పవిత్ర స్థలికి తాను రావడం గర్వకారణంగా భావిస్తున్నానని చెప్పారు.
నెహ్రూ గాయాలతో అసామీలకు ఇప్పటికీ తీరని వెతనే
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అసమర్థ వైఖరి దుష్ఫలితాలను అసామీలు ఇప్పటికీ భరించాల్సి వస్తోందన్నారు. 1962లో చైనా దురాక్రమణ దశలో నెహ్రూ అసామీలకు కల్గించిన గాయాలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో చొరబాటుదార్లను ఆక్రమిత స్థలాల నుంచి అసాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తమ ధైర్యసాహసాలతో ఖాళీ చేయించారు, ఇందుకు ఆయన అభినందనీయలు అన్నారు. ఆక్రమణదారుల తొలిగింపు తరువాత ఇక్కడి రైతులు ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఆక్రమణదారుల ఆగడాలను, వారి దురాక్రమణలను, ఇక్కడి మహిళలు, బాలికలను అవమానించడాన్ని బిజెపి సహించబోదని చెప్పారు. దేశ భద్రత, సమగ్రత, జాతీయ భావనకు ముప్పు కల్గించే ఏ శక్తి ఆటలు సాగబోవని తెలిపారు.
ఈ ప్రాంతపు భూమిపుత్రులు భారత్ రత్న భూపెన్ హజారికాను కాంగ్రెస్ గేలి చేయడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అసాంను దశాబ్దాల తరబడి పాలించింది. అయితే ఈ కాలంలో బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించారని చెప్పారు. అయితే బిజెపి పాలన దశలో, ఈ పదేండ్లలో ఆరు భారీ నిర్మాణాలు వెలిశాయని చెప్పారు. ఇక్కడి డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పనితీరు ఫలితాలు అట్టడుగు జనం వరకూ చేరుతున్నాయని తెలిపారు. అసోం పర్యటన దశలో ప్రధాని మోడీ ఇక్కడ రూ 6300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సాధనాసంపత్తుల పనులకు శంకుస్థాపన చేశారు. పలు రహదారుల పనులను కూడా ప్రారంభించారు.
Also Read: అస్సాంలో భారీ భూకంపం.. బెంగాల్, భూటాన్ లో ప్రకంపనలు