చురాచంద్‌పూర్ : మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం అయ్యే లక్షంతో తాము ముందుకు సాగుతామని ఈ ప్రాంతీయులకు ఆయన భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యి పనిచేస్తుందని తెలిపారు. మణిపూర్ ధైర్యవంతుల నేల.
పలు ఆకాంక్షలు, అపార విశ్వాసం సంతరించుకుని ఉన్న భూమి. ఇది అత్యంత సుందరమైన స్థలం, దురదృష్టవశాత్తూ ఇక్కడ నెలకొన్న హింసాగ్ని ఈ ప్రాంతంపై వీడని నీలినీడలను పర్చుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం వరకూ ఈ సంక్షుభిత ప్రాంతానికి ప్రధాని మోడీ రాకపోవడంపై రాజకీయంగా ఇతరత్రా కూడా పలు విమర్శలు వెలువడ్డాయి. ఇక్కడి కష్టపడి పనిచేసే పలు తెగల నడుమ ఘర్షణలు నెలకొనడం, కారణం ఏదైనా అందరికీ బాధాకరం. ఈ చీకటి అధ్యాయం తొలిగిపోతుంది. ఈ ప్రాంతంలో వినూత్న ఉషోదయం వెల్లివిరుస్తుందని తాను అపార విశ్వాసంతో చెపుతున్నానని స్థానికుల్లో స్థయిర్యం నెలకొనేలా చేసేందుకు ఆయన యత్నించారు. తమ లక్షం ఒక్కటే మణిపూర్‌ను శాంతియుతం, ప్రగతిమయం చేయడమే అన్నారు. ఇక్కడికి రావడానికి ముందు ప్రధాని మోడీ ఇంఫాల్, చురాచంద్‌పూర్‌లోని శరణార్థ శిబిరాలను సందర్శించారు.
కుకీ, మెయితీ బాధితులతో మాట్లాడారు. తాను ఈ ప్రాంతంలోని సహాయక శిబిరానిలకు వెళ్లి వచ్చానని, బాధితులతో మాట్లాడానని, వారిలో గత చేదు అనుభవం కన్నా ఇకముందు నెలకొనే ప్రశాంతత గురించి ఆశలు నెలకొని ఉన్నాయని తెలిపారు. వారి కలలను సాకారం చేసి తీరుతామన్నారు. కొండలలో కోనల్లో మణిలాగా ఉన్న ఈశాన్య రత్నం మణిపూర్ ఉజ్వల రీతిలో తిరిగి ప్రకాశించి తీరుతుందని, ఇదే విషయాన్ని తాను శరణార్థులతో చెప్పానని వివరించారు. ఏ ప్రాంతంలో అయినా అభివృద్ధికి శాంతియుత వాతావరణం అత్యవసరం, గడిచిన 11 సంవత్సరాలలో ఈశాన్య ప్రాంతంలో అనేక ఘర్షణలు, వివాదాలకు సరైన పరిష్కారం దక్కేలా చేశామని చెప్పారు.
పలు ప్రాంతాల వారు శాంతియుత మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలనే తపనతో ఉన్నారని, ఇక్కడ కూడా ఈ భావన నెలకొంటోందని తెలిపారు. ముందు ఘర్షణలను చల్లార్చాలి, తరువాత శాంతికి తద్వారా ప్రగతికి పాటుపడాలనేదే కేంద్ర ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సభికులకు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇక్కడ పర్వత ప్రాంతాలు, లోయల్లోని ప్రజలతో కేంద్ర ప్రతినిధులు చేపట్టిన చర్చలు చివరికి ఒప్పందాలకు దారితీశాయి. సంప్రదింపులు, గౌరవం, పరస్పర ఆమోదయోగ్యత కీలక సూత్రాలుగా తాము శాంతియుత పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. హింసాకాండతో నిర్వాసితులైన వారిని గుర్తించామని, నిరాశ్రములై తల్లడిల్లుతున్న వారి కోసం 7000 కొత్త ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని వివరించారు.
మణిపూర్‌కు రూ.7300 కోట్ల ప్రాజెక్టులు
ఇక ఈ ప్రాంతానికి రూ 3వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా ఆమోదించారు. ప్రత్యేకించి నిర్వాసితుల కోసం రూ 500 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు సరైన స్కూళ్లు , ఆసుపత్రులు లేవు, తమ పిల్లలకు ఎప్పటికీ సరైన చదువు, తమకు అవసరం అయిన ఆరోగ్య చికిత్స ఏర్పాట్లు అందుబాటులోకి వస్తాయనే నిరాశతో ఉండేవారు. ఇప్పుడు కేంద్రం సహకారంతో పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పారు. చురాచంద్‌పూర్ ప్రాంతానికి ఇప్పుడు వైద్య కళాశాల ఏర్పాటు అయిందని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మణిపూర్ పర్వత ప్రాంతంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు, ఈ అవసరాన్ని గుర్తించి , మెడికల్ కాలేజీ ఏర్పాటు అయ్యేలా చేశామని తెలిపారు. దేశం మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకోనుంది. ఈ సత్ఫలితాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా చేరాల్సి ఉంటుందన్నారు.
ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన నేపథ్యంలోనే శనివారం రూ 7300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఘర్షణలకు, తరువాతి క్రమంలో నిర్వాసితులకు నిలయంగా మారిన చురాచంద్‌పూర్‌కు ప్రధాని మోడీ ఇంఫాల్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరం రహదారి మార్గంలో వాహనంలో వచ్చారు. ఈ క్రమంలో దారిపొడువునా తనకు ప్రజల నుంచి ప్రత్యేకించి గిరిజన మారుమూల ప్రాంతం వారి నుంచి అడుగడుక్కి దక్కిన ఆదరణ , అభిమానం ఎప్పుడూ మరవలేనిదని ప్రధాని మోడీ భావోద్వేగంతో తెలిపారు. మణిపూర్‌కు త్వరలోనే తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందని ప్రధాని తెలిపారు. ప్రధాని మోడీ శరణార్థ శిబిరాలకు ప్రత్యేకమైన హ్యాట్ తో వెళ్లారు. చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ పాప తను వేసిన చిత్రాన్ని ప్రధానికి బహుకరించింది.
భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు
ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన దశలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టమైన రీతిలో చేపట్టారు. ఇంఫాల్‌లో, చురాచంద్‌పూర్ జిల్లా ప్రధాన కేంద్రంలో కేంద్రీయ బలగాలు మొహరించాయి. ఇంఫాల్‌లో 230 ఎకరాల కంగ్లా కోటలోనూ, చురాచంద్‌పర్‌లని పీస్ గ్రౌండ్‌లోనూ ప్రధాని సభలు జరగడంతో ఈ ప్రాంతం భద్రతాపరంగా దుర్భేధ్యంగా ఉంచారు.
తెగల నడుమ చిచ్చుపెట్టిన రిజర్వేషన్ల కోటా.. 2023 నుంచి రగులుకున్న అగ్నిగుండం
దేశ సరిహద్దుల్లో అత్యంత ప్రధానమైన ఈశాన్య రాష్ట్రంగా ఉన్న మణిపూర్‌లో అత్యంత ప్రాచీన కుకీలు, మొయితీల శాంతి సామరస్యానికి రిజర్వేషన్ల కోటా చిచ్చు తెచ్చిపెట్టింది. కొండ కోనల్లోని మెయితీలకు రిజర్వేషన్లు కల్పిస్తే వారు తమ నివాసిత ప్రాంతాలకు తరలివస్తారని, తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ప్రాబల్యపు కుకీ ఇతర తెగలు హింసాత్మకంగానే ఈ ప్రతిపాదనను ప్రతిఘటించాయి. దీనితో ఈ ప్రాంతంలో నెలకొన్న కుల తెగల చిచ్చు చల్లారకుండా సాగుతూ వచ్చింది. ఘర్షణలకు చురాచంద్‌పూర్ కేంద్ర బిందువు అయింది. పలు అటవీ ప్రాంతాలను రిజర్వ్‌డ్ ప్రాంతాలుగా ప్రకటించడం చివరికి వారి నుంచి సాయుధ ఘర్షణలకు దారితీసింది. మణిపూర్‌లో తెగల ఘర్షణలో 250 మందికి పైగా మృతి చెందారు. వేలాదిగా నిర్వాసితులు అయ్యారు. ప్రధాని మోడీ ఈ ప్రాంతంలో పర్యటించకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీసింది.
Also Read: మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు.. మోడీపై విమర్శలు