Wednesday, May 28, 2025

భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును ఏరేస్తాం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును ఏరేస్తామని ప్రధాని మోడీ చెప్పారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోడీ గాంధీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మహాత్మా మందిర్‌లో రూ.5,536 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. మరోసారి పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నుండి ఉగ్రవాద ముల్లును తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

“నేను గత రెండు రోజులుగా గుజరాత్‌లో ఉన్నాను. నిన్న వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్.. ఈరోజు గాంధీనగర్‌ను సందర్శించాను. నేను ఎక్కడికి వెళ్ళినా.. అది కాషాయ సముద్రం గర్జించే శబ్దంలాగా, దేశభక్తి తరంగంలా అనిపించింది. కాషాయ సముద్రం గర్జన, రెపరెపలాడే త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో మాతృభూమి పట్ల అపారమైన ప్రేమను చూపించింది. ఇది చూడటానికి మరపురాని దృశ్యం” అని ఆయన అన్నారు.

“1947లో దేశం మూడు భాగాలుగా విభజించబడింది. ఆ రాత్రినే, కాశ్మీర్‌లో మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. మన దేశంలో కొంత భాగాన్ని ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదులను ఉపయోగించి పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. ఆ రోజున, మనకు పిఓకె వచ్చే వరకు మన సాయుధ దళాలు ఆగకూడదని సర్దార్ పటేల్ చెప్పినా.. ఎవరూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు మనం గత 75 సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం. పహల్గామ్ కూడా దానికి ఒక ఉదాహరణ. పాకిస్తాన్‌తో యుద్ధాలు జరిగినప్పుడు, మేము పాకిస్తాన్‌ను మూడుసార్లు ఓడించాం” అని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News