విజింజం సీ పోర్టు ప్రారంభోత్సవం కేరళకు ఆర్థిక సుసస్థిరతను తెచ్చిపెడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేరళలో అత్యంత ప్రముఖుల సమక్షంలో శుక్రవారం ఈ రేవును ప్రధాని ప్రారంభించారు. నౌకా రవాణా విషయంలో పలు మైలురాళ్లు దాటుతున్నామని, ఈ పోర్టు ద్వారా రవాణా సామర్థం త్వరలోనే మూడింతలు అవుతుందని , ఇది ప్రత్యేకించి కేరళకు, మొత్తం మీద దేశానికి ఉపయుక్తం అయి తీరుతుందని స్పష్టం చేశారు. మన సముద్ర మార్గాలను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం నిర్ణీత దశలో ప్రగతికి బాటలు వేసుకునేందుకు వీలుంటుందని ప్రధాని చెప్పారు. ఇంతకు ముందు మన దేశీయ సరుకుల సముద్ర రవాణా ఎక్కువగా దాదాపుగా 75 శాతం వరకూ విదేశీ పోర్టుల ద్వారా నిర్వహించే వారు. దీనితో ఎంతో నష్టం వాటిల్లేది. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం చక్కదిద్దిందని మోడీ ఈ ప్రారంభోత్సవ సభలో తెలిపారు. ఇప్పుడు మన సరుకులు మన రేవుల ద్వారానే రవాణా అవుతున్నాయి.
దీనితో భారతీయ సొమ్ము ఆదా కావడం ఇతర ప్రాజెక్టుల రూపకల్పనకు దారితీయడం జరుగుతోందన్నారు. కేరళ వంటి తీర ప్రాంత రాష్ట్రాలకు ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పోర్టులు పలు విధాలైన ఏర్పాట్లతో ఉండటం ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కేరళ నుంచి సరుకులను ఇతర దేశాలకు ముందుగా పంపించేవారు. ఇప్పుడు నేరుగా ఇక్కడి నుంచే సరుకుల రవాణా జరగడం వల్ల ఈ రాష్ట్రం గ్లోబల్ కమర్షియల్ హబ్ అవుతుందన్నారు. రేవు పట్టణాల సముచిత అధునాతన ప్రగతికి కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. దేశ తీర రాష్ట్రాలు దేశ సుసంపన్న యాత్రకు కీలక మజిలీలు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ సముద్ర పరిశ్రమ విస్తరణలో సముచిత రీతిలో వ్యవహరించే ప్రైవేటు భాగస్వామ్యం అత్యవసరం అని తెలిపిన మోడీ ఈ దిశలో అదానీ గ్రూప్ సముచిత సేవలు ప్రశంసనీయం అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య తరహా ప్రాజెక్టులు (పిపిపి ) వల్ల దేశానికి జరిగే మేలును ఎవరూ విస్మరించరాదని, కేవలం విమర్శలకు దిగి సంచలనాలకు దిగితే ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.