మణిపూర్‌లో రెండేళ్ల క్రితం 2023 మే 23న మెయితీలు, కుకీ జో తెగల మధ్య రగిలిన హింసాకాండలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది కట్టుబట్టలతో ఇళ్లు విడిచిపెట్టి పోయారు. బలవంతంగా తాత్కాలిక శిబిరాలకు తరలి తలదాచుకోవలసి వచ్చింది. ఇంత దారుణంగా రావణ కాష్ఠంలా ఇప్పటికీ రగులుతున్న మణిపూర్‌లో తొలిసారి ప్రధాని మోడీ శనివారం (13.9.2025) నాడు పర్యటించారు. అక్కడ ఉన్న ఐదు గంటల సమయంలో కుకీ జో తెగ నాడీ కేంద్రమైన రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 65 కిమీ దూరంలో ఉన్న జిల్లా పట్టణం చురాచాంద్‌పూర్‌ను సందర్శించారు. హింసాకాండ గురించి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రస్తావన తీసుకు రాకుండా శాంతి పునరుద్ధరణకు చర్చలు సరైన దిశలో సాగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉన్నాయని, మరేం భయపడవద్దని ధైర్యం చెప్పారు. బహుశా తన ఆశీస్సులతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నేతృత్వంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేశం అందజేయాలన్నదే తన సంకల్పం. ఇంఫాల్ లోని చారిత్రక కంగ్లా ఫోర్ట్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆమోదయోగ్యమైన పరిష్కారానికి, జాతుల మధ్య సంఘర్షణ నివారణకు చర్చలొక్కటే సరైన మార్గమని హితబోధ చేశారు. ఈ సందర్భంగా రూ. 7300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరో రూ. 1200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసి ఈ విధంగా ఒకే రోజు ఇన్ని జరగడం నభూన్నతో నభవిష్యతి అనిపించేరు.
ఈ ఆర్భాటాలతో ప్రజలు కోరుకునే శాంతి లభిస్తుందా? అయితే అక్కడ పరిస్థితులు అంత సులభంగా లేవు. 2023లో ఇంఫాల్ వ్యాలీలో హింస చెలరేగిన దగ్గరనుంచి ఇంతవరకు 10 మంది కుకీ జో ఎంఎల్‌ఎలు అక్కడ అడుగుపెట్టలేదు. వారంతా ప్రధానిని కలిసి కేంద్రపాలిత ప్రాంతం రీతిలో ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తమ డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ మెమోరాండం సమర్పించారు. ఆ మెమోరాండంపై పది మంది ఎంఎల్‌ఎలు సంతకాలు చేశారు. వీరిలో బిజెపికి చెందినవారు కూడా ఉన్నారు. కుకీ జో సామాజిక వర్గానికి మాత్రమే ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్లనే రెండు జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందని వాళ్లు మెమోరాండంలో పేర్కొనడం గమనార్హం. ఇది సంక్షోభం పరిష్కరించే దిశలో చర్చలు సాగించే కుకీ జో వర్గం సుముఖంగా లేనట్టు స్పష్టమవుతోంది. అయితే చురాచంద్‌పూర్‌లో ప్రధాని మోడీ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు స్థానిక ప్రభుత్వ పాలనా వ్యవస్థలను మరింత పటిష్టం చేయవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీని అర్థం రాజ్యాంగం ఆర్టికల్ 371సి ప్రకారం స్వయం ప్రతిపత్తి మండళ్లుగా స్థానిక పాలనా వ్యవస్థలు పనిచేయాలన్నదే తప్ప అస్సాం రీతిలో ఆరో షెడ్యూల్ కింద పనిచేయడం కాదని తెలుస్తోంది. కానీ ఈ స్వయం ప్రతిపత్తి మండళ్లు ఆరో షెడ్యూల్ కింద ఉన్న స్వయం ప్రతిపత్తి మండళ్లులా స్వేచ్ఛగా, పారదర్శకంగా కాకుండా దాదాపు రాష్ట్రప్రభుత్వ నియంత్రణలోనే పనిచేయవలసి వస్తుంది. ఇక్కడ ఒక సమస్య ఎదురవుతోంది. మెయితీలు మణిపూర్‌ను ముక్కలు చేయడానికి అనుమతించే మానసిక స్థితిలో లేరు. రాష్ట్రాన్ని విభజించడానికి చేసే ఏ ప్రయత్నాన్ని అయినా గట్టిగా ఎదిరిస్తారు.
ఈ నేపథ్యంలో పరిష్కారం ఏమిటి? గతం మాదిరిగా మెయితీలు, కుకీలు కలసిమెలిసి జీవిస్తారా? రాష్ట్రంలో అంతర్గతంగా నిర్వాసితులైన ప్రజలు ఎక్కడైతే తమ ఇళ్లను కోల్పోయారో అక్కడకు తిరిగి వచ్చేలా వారి కోరిక నెరవేరినప్పుడే ఈ సమస్యకు జవాబు దొరుకుతుంది. అంటే ఇంఫాల్ వ్యాలీలో ధ్వంసమైన తమ ఇళ్లకు కుకీలు తిరిగి రాగలిగినప్పుడు, అలాగే చురాచాంద్‌పూర్‌లో కానీ, మరెక్కడైనా కానీ భస్మమైన తమ ఇళ్లకు మెయితీలు తిరిగి వచ్చినప్పుడు ఈ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుంది. కానీ ఇది చాలా క్లిష్టతరమైన సాహసం. ప్రభుత్వం తన ప్రయత్నాల్లో భాగంగా నిర్వాసితుల కోసం కొన్ని ఇళ్లను నిర్మించింది. కానీ చాలా మంది ఆ ఇళ్లల్లోకి తరలి రావడానికి ఇష్టపడటం లేదు. పునరావాస శిబిరాల్లో నిర్వాసితుల జీవన పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటున్నాయి. ప్రభుత్వం అందించిన సాయంతో ఒక్కో వ్యక్తి కేవలం రూ. 80 తో తమ జీవనాన్ని సరిపెట్టుకోవలసి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రజాదరణ పొందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఇంఫాల్‌లో నిరంతరం చర్చ సాగుతోంది. ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ, రాష్ట్ర అసెంబ్లీ మాత్రం రద్దు కాకుండా నిద్రావస్థలోనే ఉంటోంది.
ప్రస్తుత అసెంబ్లీ పాలనా గడువు 2027 ప్రారంభం వరకు ఉంది. ఏదెలాగున్నా ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న ప్రజాదరణ ప్రభుత్వం ఏర్పడితే ఎన్నికయ్యే కుకీ జో కమ్యూనిటీనుంచి ప్రాతినిధ్యం తప్పనిసరిగా లభిస్తుంది. ఇప్పటికే ఎన్నికైన 10 మంది శాసన సభ్యులున్నారు. ఇప్పుడు కుకీ జో కమ్యూనిటీ గ్రూపులు ఏ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నుంచి దూరంగా ఈ పది మంది ఎంఎల్‌ఎలు ఉండేలా నిషేధాన్ని కట్టడి చేశాయి. ఈ వాస్తవాలను గమనించి ఈ పది మంది ఎమ్‌ఎల్‌ఎలు కుకీ జో ప్రజలకోసం కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి మెమోరాండం సమర్పించారు. దీన్ని బట్టి భవిష్యత్తులో ఏర్పాటయ్యే ఎలాంటి కొత్త ప్రభుత్వం లోనూ భాగస్వాములు కావడానికి వారు ఇష్టపడడం లేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం మెయితీ గ్రూపులు మౌనంగా ఉంటున్నారు. ఈ ప్రశాంతత కొత్తగా ఏదైన ప్రభుత్వం ఏర్పాటైతే తుపానుగా చెలరేగక తప్పదు. ఐక్య మణిపూర్‌కు భిన్నంగా కొండ ప్రాంతాలను గుర్తించేలా అస్తిత్వం కోసం ఆందోళన ఎదురుకాక తప్పదు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడం ఒక సవాలే.
Also Read: ఓజోన్ రక్షతి రక్షితః