ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న భారత సైనికులను ప్రధాని మోడీ కలిశారు. మంగళవారం ఉదయం ప్రధాని పంజాబ్లోని అడంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అనంతరం ఆపరేషన్లో పాల్గొన్న సైనిక సిబ్బందితో ప్రధాని మాట్లాడారు. అడంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా మోడీకి వైమానిక దళ అధికారులు ఆపరేషన్ గురించి వివరించినట్లు తెలుస్తోంది.
మే 7వ తేది ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత మే 10న రెండు దేశాలు తదుపరి సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఇది కేవలం విరామం మాత్రమేనని.. భవిష్యత్తులో తీసుకునే ఏ చర్య అయినా పూర్తిగా పాకిస్తాన్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని భారత్ హెచ్చరించింది.