Monday, July 14, 2025

బహుముఖ ప్రతిభా సంపన్న కవి వేముగంటి నరసింహాచార్యులు

- Advertisement -
- Advertisement -

తెలుగు సాహిత్య వేదికపై ఆచార్యులుగా, ఆలోచనాపరులుగా, భారతీయ సంస్కృతి, దేశభక్తి, భక్తిరస సాంద్రతను కలగలిపిన రచయితగా వెలుగొందిన వేముగంటి నరసింహాచార్యులు 1930 జూన్ 30న అప్పటి మెదక్ జిల్లాకు చెందిన సిద్ధిపేటలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. 1956 నుండి 1988 వరకు ఆయ న ఉపాధ్యాయునిగా పనిచేసారు.
వేముగంటి నరసింహాచార్యులు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో రచనలు చేసి, భక్తి, దేశభక్తి, బాలసాహిత్యం మొదలైన అంశాలలో తనదైన ముద్రవేసిన కవి. వీరి ప్రారంభ రచనలు ముఖ్యంగా దేశభక్తి, జీవన చింతనలతో కూడినవిగా కనిపిస్తాయి. అవి బాష్పాంజలి (1946), భావతరంగిణి (1946), కాంతి వైజయంతి (1946) ఈ రచనల్లో స్వాతంత్య్రోద్యమానంతర భారత యువకుల ఆశయాలు, ఆత్మవిశ్వాసం స్పష్టంగా వ్యక్తమవుతాయి.

మరో వర్గం భక్తిరస రచనలు. అవి శ్రీ వేంకటేశ్వరోదాహరణము (1973), శ్రీ గణేశోదాహరణం(1987), శ్రీ వాసర సరస్వతీ వైభవము (1985), భక్తరామదాసు (1987), ఆంధ్ర విష్ణువు (1975), శ్రీ వివేక విజయము ఈ రచనల్లో దేవతామహిమలు, దైవానుభూతులు, పరమార్థ సాధనకు మార్గదర్శనం వంటి అంశాలు ఉన్నాయి. ఇంకా దేశభక్తి, వ్యక్తిత్వ వికాస రచనలలో జాతియత స్ఫూర్తితో రాసిన కృతులు ఉన్నా యి. అవి వీరపూజ, బాపూజీ, మేలుకొలుపు, పురుషహంకారం, జీవనస్వరాలు. ఈ రచనల్లో మహాత్మా గాంధీ, స్వాతంత్య్ర వీరుల దృఢత, జీవన పరమార్ధం వంటి భావాలున్నాయి. ఇక బాల సాహిత్యం విషయానికి వస్తే తెలుగు బాల సాహిత్యంలో నరసింహాచార్యులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు తెలుగు బాల, బాలగేయాలు (1979) పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా గేయాలు రాశారు. ఇవి బోధాత్మకత, వినోదాత్మకత కలగలిపిన విశిష్టమైన రచనలు. సాహిత్య విమర్శ రచనలు చూస్తే సాహిత్య చరిత్రను అధ్యయనపూర్వకంగా పరిశీలించిన కృతు లు తిక్కన, ప్రబోధము, వ్యాస కలాపం (1988), కవితాకాహళి, కాంతి వైజయంతి. ఈ రచనల ద్వారా పాఠకులకు కవిత్వ లక్షణాలు, భావవ్యా ప్తి, తాత్వికత గురించి అవగాహన కల్పించారు. చివరిగా సాంస్కృతిక, సంగీతాత్మక రచనలు మంజీర నాదాలు (1973), మణికింకిణి. ఇవి సంగీతభరిత పద్య రచనలు, కావ్యాత్మక శైలిలో సాగినవి. ఈ సమస్త రచనలు వేముగంటి నరసింహాచార్యుల యొక్క బహుముఖ ప్రతిభను, సాంప్రదాయ బద్ధతతో పాటు సమకాలీన చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి.

పదహారేళ్ల వయసులోనే జాతీయవాదానికి ప్రతీకగా నిలిచిన మదన మోహన్ మాలవ్య గారికి స్పందనగా ‘భాష్పాంజలి’ (1946) ఖండకావ్యంతో ఆయన కవితా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాక, భావోద్వేగంతో కూడిన దేశభక్తి శైలికి ఉదాహరణ కూడా. ఇంకా దేశ నాయకుల పట్ల ఆయనకున్న గాఢమైన అభిమానాన్ని ప్రతిబింబించే ఇతర రచనలలో బాపూజీ’ ప్రధానమైనది. ఇందులో మహాత్మా గాంధీ త్యాగనిష్ఠ, నిరహంకార స్వభావం, నిరాఘాట జీవితం వంటి అంశాల తాత్వికతను కవిత్వబద్ధంగా అద్భుతం గా మలిచారు. చారిత్రక దృక్కోణంలో రచించిన ‘తిక్కన’, ‘ఆంధ్రవిష్ణువు’ వంటి కావ్యాలు, కేవలం వ్యక్తి జీవిత చరిత్రలు కాక, ఆ యుగాల్లోని ఆత్మవిశ్వాసం, రాష్ట్రాభిమానాన్ని ప్రతిబింబించడంలో విశిష్టంగా నిలిచాయి. ఈ రెండు గ్రంథాలూ పలు ప్రాచ్య కళాశాలల పాఠ్య గ్రంథాలుగా ఉపయోగిస్తున్నారు. భక్తిరసంలో ‘భక్త రామదాసు’, ‘శ్రీ వాసర సరస్వతీ వైభవము’ వంటి రచనలు శ్రద్ధ, అర్పణ భావాలను ఆధ్యాత్మిక పరమార్థంగా రాశారు.

ఈ కవిత్వంలో తత్త్వచింతన, కీర్తనాశైలీ, సంప్రదాయ సంగీత ధ్వని అనుసంధానం గా కనిపిస్తుంది. అలాగే ‘శ్రీ వేంకటేశ్వరోదాహరణము’, ‘శ్రీ గణేశోదాహరణము’ వంటి ఉదాహరణాత్మక కావ్యాలు, భారతీయ సాంప్రదాయంలోని దేవతా తత్త్వాన్ని సార్వత్రిక ధర్మబోధనలతో సమన్వయ పరుస్తాయి. ఈ రెండు గ్రంథాలలో ఆలంకారికత, శైలి వైవిధ్యం, నైతికత కలగలిపిన నిర్మాణం కనిపిస్తుంది. ప్రకృతి ప్రశంసకు నదీ కవిత్వం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ‘మంజీర నాదాలు’ అనే గేయకృతి స్వస్థలమైన మంజీరా నదికి నివాళిగా, ఆమె సౌందర్యాన్ని, ప్రజల జీవన సంబంధాన్ని చిత్రించడంలో కవితా నైపుణ్యం బోధిస్తుంది. ఇది నదీప్రశస్తి ప్రక్రియకు ఉదాహరణగా నిలుస్తుంది. బాలసాహిత్యంలో వేముగంటి పేరు ఒక స్థిరమైన గుర్తింపు.

‘తెలుగు బాల’, ‘బాల గేయాలు’ వంటి కృతులు నీతి, సద్గుణాలు, దేశభక్తి వంటి అంశాల ను బాలల పట్ల ఆయనకు గల అనుబంధాన్ని వివరిస్తాయి. ముఖ్యంగా తెలుగు బాల, సుగుణ కవిత శీలమకుట వాక్యంతో రచించబడిన ‘తెలుగు బాల’ అనే అరవై ఆటవెలదుల సంకలనం బాల సాహిత్యంలో కవితా పరిణామానికి సాక్ష్యం గా నిలిచింది. కవితా ప్రక్రియలో అనేక ప్రయోగాలను చేసిన వారు కవితాకాహళి వంటి సంకలనంలో పద్యాలు, గేయాలు, ప్రకృతి గానాలు, దేశభక్తి కవిత్వం, జీవిత చింతన వంటి అంశాలను సమన్వయ పరిచారు. పత్రికల్లో వెలువడిన వ్యాసాలను ‘వ్యాసకలాపం’ పేరుతో గ్రంథస్థమయ్యేలా సంకలనం చేయడం ద్వారా తన విమరనాత్మక భావనలను రచనాత్మకంగా మలిచారు. వేముగంటి నరసింహాచార్యుల కవితలు హిందీ, గుజరాతీ భాషలలో అనువాదం అయ్యా యి. మొత్తంగా వేముగంటి రచనలు త్రైమూర్తి గుణాల సమన్వయంగా జ్ఞానం (భక్తి), చైతన్యం (దేశభక్తి), కౌముద్యం (బాల సాహిత్యం) – కనిపిస్తాయి.

తెలుగు సాహిత్యంలో కవులు, రచయితలు, విద్యార్థుల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు వేముగంటి నరసింహాచార్యులు జీవితాంతం పాటుపడ్డారు. ఈ సంకల్పం ఫలితంగా వారు స్థాపించిన సాహితీ వికాస మండలి (సిద్దిపేట), మెదక్ జిల్లా రచయితల సంఘం, సిద్దిపేట సాహితీ వికాస మండలి వంటి సంస్థలు జిల్లాలో సాహిత్య సంభాషణలకు ముఖ్య వేదికలుగా మారాయి. ఈ సంస్థల ద్వారా అనేక సాహిత్య సమావేశాలు, కవి సమ్మేళనాలు, విద్యార్థి కవితా పోటీలు, సాహిత్య బహుమతుల ప్రదానోత్సవాలు నిర్వహించారు. వేముగంటి కేవలం రచయితగానే కాక, సాహితీ సంఘాల నిర్మాణాత్మక కార్యకర్త గానూ గుర్తింపు పొందారు. ఆయన నేతృత్వంలో ఏర్పడిన ఈ సంఘాల ద్వారానే అనేక యువకవులు సాహిత్య ప్రపంచంలోకి పరిచయమయ్యారు. కవిత్వం రచించడమే కాకుండా, కవులను వెలికితీసి వారికి ప్రోత్సాహం ఇచ్చే గుణం ఆయనకు ప్రత్యేకతను చేకూర్చింది. అంతేకాక, రాష్ట్ర స్థాయి సాహితీ సంస్థ అయిన ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఆయన కార్యవర్గ సభ్యులు గా వ్యవహరించారు. ఈ పదవిలో ఆయన సారస్వత అభివృద్ధికి విశేష సేవలు అందించారు.

వేముగంటి నరసింహాచార్యులు సాహిత్య సేవకు గుర్తింపుగా అనేక బిరుదులు, గౌరవాలు, పురస్కారాలను అందుకున్నారు. సాహిత్య ప్రచురణల ద్వారా భాషా అభివృద్ధికి చేసిన కృషికి గు ర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటి నరసింహాచార్యులకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వేముగంటి నరసింహాచార్యుల రచనల న్నీ శ్రావ్యమైన పదచయనంతో, సరళమైన శైలి ద్వారా పాఠకుల మనస్సులను తాకేవిగా ఉంటా యి. భక్తిరసం, దేశభక్తి, బాలసాహిత్యం, చారిత్ర క విశ్లేషణ, నదీప్రశస్తి వంటి విభిన్న ప్రక్రియలలో తనదైన ముద్ర వేసిన ఈ మహోన్నత కవి 29 అక్టోబర్ 2005న తుదిశ్వాస విడిచారు. ఆయన రచనలు, సాహిత్య సేవ, భాష పట్ల భక్తి – ఇవన్నీ ఆయనను సాహిత్య లోకంలో చిరంజీవిగా నిలిపినవని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
డా.ఐ.చిదానందం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News