Sunday, August 10, 2025

చర్చి కేంద్రంగా రాజకీయ చదరంగం

- Advertisement -
- Advertisement -

బలవంతంగా మతమార్పిడి, మానవ అక్రమ రవాణా నేరారోపణలపై కేరళకు చెందిన ఇద్దరు నన్స్ (క్రైస్తవ సన్యాసినులు)ను చత్తీస్‌గఢ్ పోలీసులు జులై 25న అరెస్టు చేశారు. దీంతో విపక్షాలు తీవ్ర నిరసన పాటించడం ప్రారంభించాయి. తూర్పు, పడమరలుగా ఉండే ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ పార్టీలు అత్యవసర ఐక్యతను ప్రదర్శించాయి. ప్రత్యేక ప్రతినిధి వర్గాలను చత్తీస్‌గఢ్‌కు పంపాయి. చత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, వారి భజరంగదళ్ మూకల నిర్వాకం వల్లనే ఈ అరెస్టులు జరిగినప్పటికీ కేరళ బిజెపి మాత్రం ఈ సంఘటనపై రాజకీయంగా ఒక ప్రతినిధి బృందాన్ని చత్తీస్‌గఢ్‌కు పంపింది. మొత్తం మీద వీరందరి ప్రయత్నాల ఫలితంగా చివరకు ఎన్‌ఐఎ కోర్టు ఇద్దరు నన్‌లకు బెయిల్ మంజూరు చేసింది.

కేరళకు చెందిన క్రైస్తవ మిషనరీలకు ఉత్తరాదిలో చట్టపరమైన ఇబ్బందులు, అకారణ శత్రుత్వం ఎదురు కావడం ఇది మొట్టమొదటిసారి కాదు. అయితే ఈ కేసులో ప్రత్యేకంగా తీవ్ర రాజకీయ ప్రతిధ్వని, బలమైన స్పందన లభించడానికి కారణం ఆ నన్స్ కేథలిక్కులు. కొన్ని నెలల్లో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేథలిక్ నన్స్‌ను నిర్బంధంలో ఉంచడం ఆగ్రహావేశాలకు దారితీసింది. కేరళలో హిందువులు, ముస్లింలు, తరువాత మూడో భారీ సామాజిక వర్గం క్రైస్తవులే. ముఖ్యంగా కేథలిక్ క్రైస్తవుల ప్రభావం చెప్పుకోతగినంతగా ఉంటోంది. విద్యారంగం, ఆరోగ్య భద్రత, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనే కాదు, రాజకీయాల్లో, పాలనా విధానాల్లో కూడా వారి ప్రాముఖ్యత కనిపిస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ సామాజిక వర్గం రాజకీయ కార్యకలాపాలతో నిమగ్నమైంది. భారీ ఎత్తున యువత పశ్చిమ దేశాలకు వలసపోతుండడం, తదితర సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. రాజకీయాలపై చర్చికి పట్టు ఎంత ఉందో అస్పష్టమే అయినప్పటికీ చత్తీస్‌గఢ్ సమస్య చర్చిని తిరిగి రాజకీయ ప్రభావం వైపు మళ్లిస్తోంది. చారిత్రకంగా పరిశీలిస్తే కాంగ్రెస్ నడిపిస్తున్న యుడిఎఫ్‌కు కేథలిక్ ఓట్లే కీలకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ ట్రావన్‌కోర్ రీజియన్‌లో అయితే యుడిఎఫ్ ప్రభుత్వం పతనమైన తరువాత ఆ అనుబంధం బలహీనం కావడం ప్రారంభమైంది. కేరళ కాంగ్రెస్ మూలపురుషుడు కె.ఎంమణి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒమెన్ చాందీ మృతి చెందిన తరువాత సంబంధాల అగాధం మరింత ఎక్కువైంది. సిఎఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ కేరళ కాంగ్రెస్(ఎం)తో పొత్తు కుదుర్చుకుని ఈ అవకాశాన్ని వేగంగా వినియోగించుకుంది. కాంగ్రెస్(ఎం) అన్నది కేథలిక్ మూలాలు కలిగిన ఒక చీలిక గ్రూపు.

యుడిఎఫ్‌కు కంచుకోటగా ఉన్న సెంట్రల్ ట్రావన్‌కోర్ నియోజకవర్గంలో ఎల్‌డిఎఫ్ జెండా ఎగురవేయగలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాక, కేథలిక్ మెజారిటీ నియోజకవర్గాల్లో చెప్పుకోతగినట్టుగా విస్తరించింది. ఏదేమైనా చర్చి మౌనం వహించలేదు. వ్యవసాయ సంక్షోభం, వన్యమృగాల దాడులు తదితర సమస్యలపై ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి సవాలు విసిరింది. కోల్పోయిన ప్రాభవాన్ని పొందడానికి కాంగ్రెస్ గత మే నెలలో కేథలిక్ నాయకుడు సున్నీ జోసఫ్‌ను కేరళ కాంగ్రెస్ అధినేతగా నియమించింది. సెంట్రల్ ట్రావన్‌కోర్, మలబార్‌ల్లో కేథలిక్ వర్గాలపై జోసఫ్‌కు గట్టి పట్టుంది. సెంట్రల్ ట్రావన్‌కోర్‌లోని 21 సీట్లలో కేవలం మూడింటిలోనే కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నప్పటికీ, ఈ నియామకం రాజ కీయ పునర్ వైభవానికి దోహదం చేస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈలోగా కేరళలో కేథలిక్ ఓట్లను సాధించుకోవడానికి బిజెపి మెల్లగా పావులు కదుపుతోంది.

మొదట్లో లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్ ఆందోళనల్లో పాలుపంచుకుని వ్యూహాత్మక విస్తరణ యత్నాలు సాగించింది. క్రిస్టియన్ నాయకులను పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించి చర్చి వర్గాలతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నించింది. 2023 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ కేథడ్రెల్ చర్చిని సందర్శించి కోచికి చెందిన అగ్రస్థాయి బిషప్‌లను కలుసుకున్నారు. అయితే ఆ ‘హానీమూన్’ అనుబంధం కొంతకాలమే సాగింది. మణిపూర్‌లోని చర్చిలకు వ్యతిరేకంగా హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో అనుబంధాలు సడలిపోయాయి. పాలస్తీనా అనుకూల వైఖరి విపక్షాలు అనుసరించినప్పుడు చర్చికి మద్దతుగా బిజెపి వ్యవహరించింది. అలాగే మునంబాంలో వక్ఫ్‌బోర్డ్ భూముల వివాదం కూడా చర్చిని ఆకర్షించడంలో బిజెపికి కలిసి వచ్చింది. రాజకీయ భాగస్వాములను గుర్తించడం క్రమేణా పెరగడంతో ప్రజాసమస్యల పరిష్కారంలో చర్చి తనకు తాను కీలకపాత్ర వహించడం మొదలయ్యింది.

అయినప్పటికీ చర్చివర్గాలో విభిన్న పోకడలు కనిపించాయి. కొంతమంది క్రైస్తవ మతపెద్దలు బిజెపితో అంటకాగడానికి ఇష్టపడగా, అత్యధిక వర్గాలు బిజెపికి దూరంగానే ఉన్నాయి. దీనికి ప్రబల కారణం బిజెపికి హిందుత్వ గ్రూపులతో సంబంధాలు పెనవేసుకుని ఉండడమే. అవి క్రిస్టియన్‌లకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటాయి. కేథలిక్ ఓట్లు కీలకమైనవని రాజకీయ పార్టీలు గుర్తించడంతో చత్తీస్‌గడ్ వ్యవహారంపై పార్టీలన్నీ శద్ధ్ర చూపించడం ప్రారంభించాయి. చత్తీస్‌గఢ్‌లోని నన్స్ అరెస్టులపై ఉత్తర, మధ్యభారతంలోని క్రైస్తవ మతపెద్దలు ఏ విధంగా స్పందిస్తారో కేథలిక్ చర్చికి ఒక పరీక్ష. కేరళ కేథలిక్ చర్చి రాజకీయంగా ఎటువంటి పాత్ర వహిస్తుందో, ఏ స్థానాన్ని తనకుతాను ఎంచుకుంటుందో త్వరలో రానున్న రెండు ఎన్నికల ఘట్టాలు నిరూపిస్తాయి. ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఏ పార్టీకి వత్తాసు లభిస్తుందో గ్యారంటీ కాకున్నా పోరాటంలో చర్చి పాత్రకు ఎంతో విలువ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News