ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం తన ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా పరిపాలనా వ్యవస్థను ఏర్పరుచుకుంటుంది. సాధారణంగా ప్రజాస్వామ్యం, నియంతృత్వ పాలన, సమాజవాద పాలన, మతాధారిత పాలన, గణతంత్ర పాలన అనే విధానాలు చరిత్రపరంగా కనిపిస్తాయి. ఇవన్నీ కాలానుగుణంగా, ప్రజల అవసరాలను బట్టి మారుతూ వస్తాయి. అయినప్పటికీ ఏ విధమైన పాలనా వ్యవస్థలోనైనా ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, వారికి భద్రత కల్పించడం, సమానత్వం చూపించడం, జీవన విధానంలో న్యాయం నిలబెట్టడం అనేవి శాశ్వత సూత్రాలుగా నిలుస్తాయి. ఒక దేశ రాజకీయ అస్తిత్వం అంటే కేవలం అధికారం సాధించడం కాదని, సమాజం మొత్తం మానవీయ విలువలతో నిండిన భవిష్యత్తు వైపు పయనించేటటువంటి దారిని చూపడం అని అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రధాన బలం నమ్మకం.
నమ్మకాన్ని కోల్పోతే రాజకీయ బలం కూడా క్షీణిస్తుంది. అందుకే ప్రతి పార్టీ తనలో మార్పు తెచ్చుకుంటూ కాలానికి అనుగుణంగా తన విధానాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. ఆ మార్పు యాదృచ్ఛికం కాకుండా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచి ఉండాలి. ఆలోచనలో స్పష్టత, పనిలో సమర్థత, మాటల్లో నిజాయితీ -ఈ మూడు కలిసినప్పుడే ఒక పార్టీకి చిరస్మరణీయ స్థానం ఏర్పడుతుంది. అత్యంత ప్రాధాన్యమున్న విషయం ఏమిటంటే రాజకీయాలు మానవత్వం ఆధారంగా సాగాలి. మానవ విలువలను పక్కనబెడితే ఏ వ్యవస్థా నిలబడదు. కరుణ, సమానత్వం, సహనం, సామాజిక న్యాయం- ఇవి మాత్రమే ఒక దేశాన్ని ముందుకు నడిపించే దీపస్తంభాలు.
ప్రజలకు భద్రత కల్పించడం, వారికి సురక్షితమైన జీవనం అందించడం ఒక ప్రభుత్వానికి మొదటి కర్తవ్యంగా నిలుస్తుంది. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఆ ప్రభుత్వం, ఆ పార్టీ నిజమైన రాజకీయ అస్తిత్వాన్ని సాధించినట్టవుతుంది. ప్రజల కోసం కృషి చేయడం, వారి కోసం చట్టాలు రూపకల్పన చేయడం, సమాజాన్ని సమతుల్యంగా మలచడం, అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించడం. -ఇది ఒక రాజకీయ వ్యవస్థకు ఉన్న అసలు సారం. ఈ మార్గంలో నడిచే దేశాలు మాత్రమే నిలకడైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తాయి. ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఎంతకాలం అధికారంలో ఉన్నదన్నది కాదు, ప్రజల మనసుల్లో అది ఎన్ని తరాలపాటు నిలిచిపోతుందన్నదే నిజమైన విజయానికి ప్రమాణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీకి కేవలం అధికారం సాధించడం మాత్రమే కాక, ఆ అధికారాన్ని సమర్థంగా నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవడం అత్యంత ముఖ్యమైన బాధ్యతగా ఉంటుంది.
ప్రజలకోసం చేసిన ప్రతిజ్ఞలు కేవలం కాగితంపై ఉండకుండా ఆచరణలోకి వస్తేనే ఆ పార్టీ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది. ఒక పార్టీకి అనుకూలంగా వున్న అలజడులు ఎంత కాలం నిలిచినా, ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చే సందేహాలు ఒకే ఒక్క సమయంలో వర్షం లాంటి ప్రభావం చూపగలవు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం మాత్రమే కాకుండా, ఆ నమ్మకాన్ని తరతరాలపాటు కాపాడుకోవడం ఒక పార్టీకి శాశ్వత చిహ్నంగా మిగులుతుంది. ఈ ధోరణి ఒక దేశ రాజకీయ నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. ఒక పార్టీ ప్రజల ఆవశ్యకతలను బట్టి మార్పులు స్వీకరించగలగాలి. కాలానుగుణంగా మారే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకొని వాటికి తగ్గట్టుగా విధానాలను రూపొందిస్తేనే ఆ పార్టీ నిరంతర ప్రయాణంలో విజయవంతమవుతుంది.
ఉదాహరణకు వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలు ఎప్పటికీ మారిపోని ప్రజల ప్రాధాన్యాలుగా ఉంటాయి. ఈ అంశాలపట్ల నిరంతర శ్రద్ధ చూపకపోతే ప్రజల విశ్వాసం దూరమవుతుంది. ఒక పార్టీ ఎప్పటికీ జీవంతంగా ఉండాలంటే నూతనతను స్వీకరించాలి. పాత పద్ధతులకే పరిమితం కాకుండా నూతన ఆలోచనలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల సమస్యలను తీర్చగలగాలి. అప్పుడే ఆ పార్టీ తన ఉనికిని నిలుపుకుంటుంది. భారతదేశ రాజకీయ పరిణామాలను గమనిస్తే ప్రతి దశలో ప్రాంతీయ శక్తులు, జాతీయ శక్తులు పరస్పరం ప్రభావం చూపినట్లు స్పష్టమవుతుంది. ప్రజాస్వామ్యపు అసలు సారాంశం అంటే ప్రతి వర్గానికీ, ప్రతి ప్రాంతానికీ గళాన్ని కల్పించడం.
ఈ దృక్కోణంలో ప్రాంతీయ పార్టీలు సాధించిన స్థానం అసాధారణం. ఒకప్పటి వరకు కేంద్రంలో మాత్రమే నిర్ణయాలు జరుగుతాయని అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు రాష్ట్రాల నుండి కూడా కేంద్ర నిర్ణయాలకు మలుపులు వస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యపు వైవిధ్యాన్ని మరింత బలపరుస్తోంది. జాతీయ స్థాయిలో కూడా ప్రాంతీయ శక్తుల పాత్రను విస్మరించలేం. మహాసభలలో తీర్మానాలు, పార్లమెంట్‌లో చర్చలు, విధానాల రూపకల్పన- ఇవన్నీ ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ముందుకు సాగలేవు. కొన్నిసార్లు జాతీయ విధానాల దిశను మార్చగలిగేది కూడా వీరే. ఇది ప్రజాస్వామ్యంలో బహుముఖత్వానికి చిహ్నం. అయితే ఈ పోటీతో పాటు సహకారం కూడా అవసరం. ప్రజాస్వామ్యానికి పోటీ అంతే ముఖ్యం, కానీ పరస్పర అవగాహన కూడా అంతే అవసరం.
ఒకే దేశంలో వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు సమాజాలు, వేర్వేరు సంస్కృతులు ఉన్నా కూడా, ఆ వైవిధ్యంలో ఏకత్వాన్ని నిలబెట్టడం ప్రధాన కర్తవ్యంగా మారింది. దీని కోసం అన్ని రాజకీయ శక్తులు సహనంతో, సహకారంతో ముందుకు రావాలి. ప్రజలు ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. రాజకీయ నాయకుల వాగ్దానాలు, ఆచరణ, ఆలోచనలు -ఇవన్నీ సమీక్షించబడుతున్నాయి. ఒకప్పటిలా మూగఓటు పడే రోజులు కావు. చదువుకున్న, అవగాహన కలిగిన యువతరం ప్రశ్నిస్తోంది, వాదిస్తోంది. ఈ కొత్త తరానికి తగిన సమాధానాలు ఇచ్చినప్పుడే రాజకీయాలకు విశ్వసనీయత వస్తుంది. తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీకీ ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కటి తనదైన దారి, తనదైన అజెండాతో ముందుకు సాగుతోంది.
ఈ విభిన్న దృక్కోణాలన్నీ కలిపి సమాజానికి ఒక సమగ్ర రాజకీయ బలాన్ని ఇస్తున్నాయి. ఎవరూ చిన్నవారు కారు, ఎవరూ ఎక్కువ అనుకునే పరిస్థితి కూడా లేదు. ప్రజలే అసలు నిర్ణేతలు. వారు ఎవరిని ఎంచుకుంటే వారే అధికారం పొందుతారు. ఇది ప్రజాస్వామ్యపు మహత్తు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక స్పష్టమైన విషయం ఏమిటంటే -ప్రజలు అభివృద్ధిని, పారదర్శకతను, బాధ్యతాయుతమైన పాలనను కోరుతున్నారు. ఈ డిమాండ్‌ను తీర్చగలిగిన పార్టీ ఏదైనా ప్రజల్లో నిలబడగలదు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రహదారులు మాత్రమే కాదు. అది విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాన హక్కులు అన్నింటినీ కలిపిన విస్తృత దృష్టి. ఈ దృష్టితో ముందుకు వచ్చిన శక్తులకే ప్రజల మద్దతు దక్కుతుంది.
- చిటికెన కిరణ్ కుమార్
94908 41284