Thursday, August 21, 2025

మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

- Advertisement -
- Advertisement -

పేదలకు ఇళ్ల నిర్మించడంలో పదేళ్ల కాలంలో ఆనాటి పాలకులు మాటలకే పరిమితమైతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను, ఆధునీకరించిన కార్యాలయ ఛాంబర్‌లను బుధవారం మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. పేదవాడి ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు అవుతుందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ కార్పొరేషన్ మూసివేసే దిశగా….
గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ కార్పొరేషన్‌ను దాదాపు మూసివేసే స్థాయికి తీసుకెళితే, తమ ప్రభుత్వం దానికి పునర్‌జీవనం కల్పిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. అందుకే ఆ కార్పొరేషన్‌లో పనిచేసే సిబ్బందికి కూడా మంచి వసతులను కల్పిస్తూ ఇంకా పటిష్టం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ సిబ్బంది ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి లక్ష్యసాధనకు తోడ్పాటును అందించాలని మంత్రి కోరారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు విడతల వారీగా ఇళ్లు వస్తాయన్న భరోసా కల్పించగలిగామని, ఇది చేతల ప్రభుత్వమని, ఇప్పటికే గ్రామాల్లో కొనసాగుతున్న పనులే దానికి నిదర్శనమని ఆయన తెలిపారు.

ప్రతికూల ఆర్ధిక పరిస్థితులున్నప్పటికీ ప్రతి సోమవారం లబ్ధిదారులకు చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని, భవిష్యత్‌లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి గౌతం ప్రసంగిస్తూ కార్పొరేషన్‌ను పూర్తి స్థాయిలో పునరుద్దరించే చర్యల్లో భాగంగా, జిల్లాలో ఏఈల నియామకంతో పాటు, అవసరమైన మేరకు ఇతర విభాగాల అధికారుల సేవలను వినియోగించుకుంటున్నా మన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తోపాటు హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News