Wednesday, July 30, 2025

స్థానిక నాయకుడికే సీటు.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక నాయకున్నే అభ్యర్థిగా బరిలోకి దించుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం మంగళవారం జూబ్లీహిల్స్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ రెప రెపలాడనున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి ఉంటారని ప్రశ్నించగా, తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.

అభ్యర్థి ఎవరైనా పార్టీ నాయకులంతా సమిష్టిగా అభ్యర్థి విజయానికి తోడ్పడుతారని ఆయన వివరించారు. పోటీ చేయడానికి కొంత మంది ముఖ్య నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థి ఎవరు ? అనేది ముఖ్యం కాదని, విజయమే తమ లక్షమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, ఇంకా చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యంతో సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని, వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయిస్తున్నామని మంత్రి పొన్నం వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News