హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు రాసిన లేఖ గురువింద గింజ సామెతను గుర్తు చేసే విధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలంటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు రాసిన లేఖపై పొన్నం స్పందించారు. తెలంగాణకు 11 సంవత్సరాల నుంచి ఏం చేశారని బిజెపి నాయకులను ప్రశ్నించారు. తెలంగాణకు ఇప్పటివరకు ఒక్క రూపాయి మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని, ఎనిమిది మంది బిజెపి ఎంపిలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి ఏం చేస్తున్నారని పొన్నం ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించిందని ఏమైందని నిలదీశారు. పాలమూరు – రంగా రెడ్డి ఎత్తిపోతల కి జాతీయ హోదా ఇవ్వకుండా మీనవేషాలు లెక్కిస్తుంది ఎవరు?, పోలవరం ముంపుతో సంబంధం లేని ఐదు పంచాయతీలను ఎందుకు విలీనం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు.
భద్రాద్రి రామయ్య భూములను ఆంధ్రాకు అప్పనంగా ఎవరు అప్పగించారని మండిపడ్డారు. గత 11 ఏళ్ల నుంచి దేశం ప్రజలను అడగడుగున వంచిస్తోందని పొన్నం దుయ్యబట్టారు. రైతులు, యువకుడు, మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలను వంచించిన చరిత్ర బిజెపికే దక్కుతుందన్నారు. బిజెపి గత మూడు ఎన్నికల్లో హామీలు ఇచ్చింది కానీ ఎక్కడైనా అమలు చేశారా? అని చురకలంటించారు. మాటలతో మభ్యపెట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్దాలకు మారుపేరుగా బిజెపి నాయకులు తయారయ్యారని విరుచుకపట్టారు. బిజెపి వైఫల్యాల గురించి రాస్తే రామాయణం, వింటే మహాభారతం కూడా సరిపోదని పొన్నం ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని గొప్పలు చెప్పే బిజెపి వాళ్లకు, భద్రాద్రి రాముడికి 17 కిలోమీటర్ల దూరంలోని పాండురంగాపురం స్టేషన్ కనపడడం లేదా? అని ప్రశ్నించారు.
మూసి ప్రక్షాళన కోసం మోడీ సర్కార్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి మంజూరు చేయకున్నా మూతి మూసుకుంది తెలంగాణ బిజెపి ఎంపిలు కాదా?, గంగా ప్రక్షాళన కోసం మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 10,792 కోట్లు మంజూరు చేసిందని, మరో 36 నదుల ప్రక్షాళన కోసం ఆరు వేల కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని,. కాని ఆ జాబితాలో మూసీ నది ఎందుకు లేదని అడిగారు. కృష్ణా జలాల్లో నీటి వాటా తెల్చకుండా నాన్చుతుంది కేంద్ర ప్రభుత్వం కాదా?, సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటును పట్టించుకోనిది మోడీ ప్రభుత్వం కాదా? అని దుమ్మెత్తిపోశారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వకుండా మోసం చేసింది బిజెపి వాళ్ల కాదా? అని కడిగిపారేశారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారు వెంట ఇండ్రస్టియల్ కారిడార్, ఢిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు, కానీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.