బీసీలపై మంత్రి పొన్నంకు అవగాహన లేదన్న బిఆర్‌ఎస్ సభ్యుడు గంగుల
ఆకారం ఎక్కువగా ఉంటే అవగాహన ఎక్కువ ఉందనుకోవడం పొరపాటన్న మంత్రి పొన్నం
సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల రెండో రోజు ఆదివారం పురపాలక చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీసీలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అవగాహన బిఆర్‌ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ అవగాహన లేదని వ్యాఖ్యానించడంతో సభలో ఒక్కసారిగా మంత్రులు, సభ్యులు తీవ్రంగా స్పందించారు. అదే సందర్భంలో మంత్రి పొన్నం ఘాటుగా స్పందిస్తూ ఆకారం ఎక్కువగా ఉంటే అవగాహన ఎక్కువ ఉందనుకోవడం పొరపాటని జవాబిచ్చారు. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అంశంపై వివరాల్లోకి వెళితే పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి తరఫున పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థలన్నింటిలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తాము గట్టిగా సంకల్పించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని గత ప్రభుత్వం చేయలేని పని తమ ప్రభుత్వం చేసిందని పొన్నం స్పష్టం చేశారు. అనంతరం జోక్యం చేసుకున్న గంగుల మాట్లాడుతూ బీసీలపై పొన్నం ప్రభాకర్‌కు వాస్తవం తెలీదని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర వివరణ ఇస్తే బాగుంటుందని కోరారు. ఈ దశలో గంగుల వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుబడుతూ బీసీల్లో అనుమానాలు కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని కోరారు. కేసీఆర్ కుటుంబం ఎవరినీ కలవని కుటుంబమని విమర్శించారు.
బీసీ బిల్లును స్వాగతిస్తున్నాం..
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లును తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని, అయితే శాస్త్రీయ పద్దతిలో చేయాలని మాత్రమే కోరుతున్నామని బిఆర్‌ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ వ్యాఖ్యనించారు. వెనుకబడిన కులాలను మోసం చేయవద్దని ఆనాడే చెప్పామని, తమ సూచనలు పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి చిక్కులు ఉండవని చెప్పామన్నారు. జీవో ఇవ్వకుండా గడచిన 22 నెలలు ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. సుమారు ఆరు కమిటీలు వేశారని, 2024 మార్చిలో బీసీ కమిషన్ ద్వారా జీవో తీసుకొచ్చారని చెబుతూ తదనంతరం బీసీ కమిషన్ మాయమైందని గంగుల అన్నారు. తర్వాత జీవో నెం.18 తీసుకొచ్చారని, ప్లానింగ్ డిపార్టుమెంట్ ద్వారా సర్వే చేస్తామన్నారని గుర్తు చేశారు. అనంతరం కలుగజేసుకున్న మంత్రి పొన్నం గంగుల కామెంట్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తనకు ఏమీ తెలీదని అనటం బిఆర్‌ఎస్ సభ్యుడు గంగుల అవివేకమని అన్నారు. ఆకారం ఎక్కువగా ఉంటే అవగాహన ఎక్కువ ఉందనుకోవడం పొరపాటని పేర్కొన్నారు. గంగుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని గంగుల కామెంట్లను వెనక్కి తీసుకోవాలని కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా జోక్యం చేసుకుని సీనియర్ సభ్యుడిగా మంత్రిని ఆ విధంగా మాట్లాడడం సరికాదని, మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తప్పుపట్టారని అన్నారు. వెంటనే మీరు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు చెప్పాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ సభ్యుడు గంగుల ప్రభాకర్‌ను ఉద్దేశించి అన్నారు. ఇందుకు గంగుల స్పందిస్తూ తాను తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయాలని కోరుతున్నానని అన్నారు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇలాగే జివోలు ఇవ్వడం వల్ల రిజర్వేషన్ల అంశం న్యాయపరంగా నిలువ లేదని, అందుకే పార్లమెంటులో బిల్లు ఆమోదించి తద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా రిజర్వేషన్లు అమలు చేయడానికి సంపూర్ణంగా వీలుంటుందని తెలిపారు. ఇదే విషయం చెప్పాను తప్ప తాను గానీ, తమ పార్టీ గానీ బిసి రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదని, అందరికన్నా తానే ఎక్కువగా సంతోషిస్తానని చెప్పారు. దీంతో సభలో కాసేపు వాగ్వాదం అనంతరం ఈ అంశంపై చర్చ ముగించారు.