Wednesday, September 17, 2025

పరారీలో పూజా ఖేడ్కర్ తండ్రి, బాడీగార్డ్

- Advertisement -
- Advertisement -

థానే: నవీ ముంబైలో ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసిన మాజీ ఐఎఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్, అతడి అంగరక్షకుడు పరారీలో ఉన్నట్లు నవీ ముంబై పోలీస్ అధికారి తెలిపారు. ఒక రోజు ముందు పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ ఇంట్లోకి పోలీసులు రాకుండా నిరోధించింది. ఆమె కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కిడ్నాప్‌కు గురైన ట్రక్కు డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్(22)ను ఆదివారం పోలీసులు రక్షించారు. శనివారం సాయంత్రం అపహరణకు గురైన కొన్ని గంటల్లోనే పోలీసులు అతడిని రక్షించారు. సెప్టెంబర్ 13న దిలీప్ ఖేడ్కర్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొంది. ఆ తర్వాత దిలీప్, ఆయన బాడీగార్డు ప్రపుల్ల, ట్రక్కు డ్రైవర్ ప్రహ్లాద్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళతామని చెప్పి 150 కిమీ. దూరంలో ఉన్న పుణెకు తీసుకెళ్లారు. తనను బలవంతంగా తీసుకెళ్తున్నారని ట్రక్కు డ్రైవర్ యజమానికి ఫోన్‌లో తెలిపాడు. దాంతో ట్రక్కు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాహనం నెంబర్ ఆధారంగా పోలీసులు పుణెలోని ఖేడ్కర్ నివాసానికి వెళ్లారు. ఎస్‌యువికి జరిగిన నష్టాన్ని వసూలు చేసుకోడానికి ట్రక్కు డ్రైవర్‌ను అపహరించి తీసుకెళ్లారని డిసిపి (నవీ ముంబై జోన్ వన్) పంకజ్ దహానే మంగళవారం తెలిపారు. పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ ఆదివారం పోలీసులు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడమే కాకుండా, డ్రైవర్‌ను అపహరించిన నిందితులను ఆదివారం మధ్యాహ్నం మూడు కల్లా పుణెలోని చతుష్రింగీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను నమ్మి పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. కానీ మూడు గంటలకు ఫోన్ చేస్తే ఆమె పోలీస్ స్టేషన్‌కు రాడానికి నిరాకరించారు. పైగా అపహరణకు ఉపయోగించిన వాహనంను దొరక్కుండా చేయడమేకాకుండా, నిందితులు ఇద్దరు పరారయ్యేందుకు తోడ్పడ్డారు. పోలీసులు కేసు రిజిష్టరు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News