Sunday, August 17, 2025

శాశ్వత ప్రయోజనాల కల్పనే ధ్యేయం కావాలి

- Advertisement -
- Advertisement -

యావత్ భారతదేశం 79వ స్వాతంత్య్రదినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంది. ఎందరో అమర వీరులు, స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాల పలితంగానే భారతావని బానిస సంకెళ్ళు తెంచుకుని స్వేచ్చావాయువులు పీల్చుకునింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వీయ పరిపాలనతో తమ జీవితాలు బాగుపడతాయని అనేక ఆశలతో దేశ ప్రజలందరూ ఒకే తాటిపైకి వచ్చి వలస పాలకులతో పోరాడి స్వరాజ్యం సాధించుకున్నారు. కానీ దేశంలొ స్వపరిపాలన మొదలై ఎనిమిది దశాబ్ధాలు కావస్తున్నా స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలకు, ప్రజల ఆశలకు ఇంతవరకు సార్ధకతలభించక పోవడం గమనార్హం. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఆర్ధిక అసమానతలు, సామాజిక అసమానతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పేదలు ఆర్ధికంగా ఎదుర్కొనే ప్రతి సమస్యకు అండగా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు.

తాత్కాలి ఉచితాలు, ఉచిత పధకాలు కూడా శాశ్విత పేదరిక నిర్మూలనకు ఏమాత్రం ప్రయోజనం కల్పించవు. ఉచిత పధకాలు కేవలం పేదలకు ఉపశమనం మాత్రమే కల్పిస్తాయి. శాశ్విత ప్రయోజనాలు కల్పించి, సామాజిక పరంగా పేదల జీవన మనుగడకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వాలు చిత్తశుద్దితో కల్పించినప్పుడే పేదలు ఆర్ధికంగా బలపడతారు. మానవ మనుగడకు , అభివృద్ధికి మూలం విద్య. అదేవిధంగా విద్య బాల బాలికల ప్రాధమిక హక్కు. అంతటి ప్రతిష్టాత్మకమైన విద్య ప్రస్తుతం అంగడిలో వస్తువుగా మారి అత్యంత ఖరీదుగా తయారయ్యింది.

నాణ్యమైన విద్య ఉచితంగా ప్రజలందరికీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అదేసమయంలో ప్రభుత్వ విద్యావ్యస్థ పై విద్యార్ధుల తల్లి దండ్రులలో విశ్వసనీయత పూర్తిగా క్షీణించింది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలలో తమ పిల్లలను చదివించడాన్ని విద్యార్ధుల తల్లి దండ్రులు ప్రస్తుతం చాలా చిన్నతనంగా భావిస్తున్నారు. ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలలో చదివిస్తేనే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే భ్రమ లోకి విద్యార్ధుల తల్లి దండ్రులు వెళ్లిపోయారు. దీంతో అర్హతా ప్రమాణాలు, ఫీజులపై నియంత్రణ లేని ప్రైవేటు,కార్పోరేట్ విద్యాసంస్థలలో తమ పిల్లలను చేర్పించి ఎగువ,దిగువ మద్యతరగతి ప్రజలతో పాటూ అనేక మంది పేద విద్యార్ధుల తల్లి దండ్రులు కూడా తమపిల్ల ఫీజులు చెల్లించడానికి ఇళ్ళూ, వళ్ళూ గుల్ల చేసుకుంటున్నారు. అదేవిధంగా తమ పిల్లల ఫీజులు చెల్లించడానికి జీవితాంతం తీర్చలేని అప్పులు చేస్తూ ప్రతి సంవత్సరం అనేక మంది ఎగువ, దిగువ మద్యతరగతి తల్లిదండ్రులు కడు పేదరికంలోకి దిగజారి పోతున్నారు.

పాలకులు ప్రతి సంవత్సరం విద్యపై వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటు చేయడం, విద్యావ్యస్థలో సంస్కరణలు తీసుకు రావడం చేస్తున్నా ప్రజలలో ప్రభుత్వ విద్యావ్యవస్థ పై ఉన్న చులకన భావం ప్రస్తుత పరిస్థితులలో తొలగేటట్లు కనిపించడం లేదు. శక్తికి మించి ఫీజులు చెల్లిస్తూ విద్యాభ్యాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని, అర్హతా ప్రమాణాలు లేని ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలలో చదివిస్తేనే తమ పిల్లకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అనే భ్రమను తొలగించి ఆహ్లాదహకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడి అన్ని అర్హతా ప్రమాణాలు కలిగి ఉచితంగా విద్యను అందించే ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యార్ధుల తల్లిదండ్రులకు విశ్వసనీయత కలిగేటట్లు ప్రభుత్వం చిత్తశుద్దితో తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి పై తరగతుల అడ్మిషన్లలో, ప్రభుత్వ ఉద్యోగాలలో కొద్ది శాతం రిజర్వేషన్లు కల్పించడం, పాలకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వంటి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ విద్యావ్యవస్థకు మళ్ళీ మహర్ధశ కలిగినట్లే.

పేద ప్రజలు ఎదుర్కొంటున్న రెండో ప్రధానమైన సమస్య వైద్యం. తగిన వైద్యం ప్రతి పేద వానికి ఉచితంగా సకాలంలో అందించ వలసిన బాధ్యత కచ్చితంగా పాలకులదే.కానీ అకస్మాత్తుగా కొద్దిపాటి అనారోగ్యం కలిగినా వసతులు లేని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక, ప్రైవేటు గా వైద్యం చేయించుకునే ఆర్ధిక స్తోమత లేక రాష్ట్రంలోని పేద ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. తీవ్రమయిన, ప్రాణాపాయం కలిగించే అనారోగ్యం కలిగితే వారి బాధ వర్ణనాతీతం. వైద్యం కూడా ప్రస్తుతం కార్పోరేట్ కబంధ హస్తాలలో చిక్కుకు పోయింది. పేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షా పండుగా మారింది. ముఖ్యమంత్రి సహాయ నిధులు, మూడు వేలకు పైగా జబ్బులకు వర్తించే ఆరోగ్యశ్రీ పధకాలు పేద ప్రజలకు సకాలంలో సరైన వైద్యం ఉచితంగా అందించలేక పోతున్నాయి. సొంత గూడు లేక పేద ప్రజలు లక్షలాది మంది ఇప్పటికీ పూరి పాకలలో, పెంకుటి ల్లులలో నివసిస్తూ వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ఉన్నారు.

నవ్యాంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లు, ఇండ్ల స్థలాలకు పోటెత్తిన ప్రజలే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మందికి సొంత ఇండ్లు లేవు అనేదానికి నిదర్శనంగా భావింపవచ్చు. కనుక ప్రభుత్వం ఇండ్లు లేని వారికి ఇండ్లు,ఇంటి స్థలాలు మంజూరు చేయడం కూడా పేదరిక నిర్మూలనలో భాగం అని చెప్పవచ్చు. రాష్ట్రాన్ని పీడిస్తున్న మరో అతి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కనుక ఖాళీగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపధికన భర్తీ చేసి, ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే పేదల కుటుంబాలకు ఆర్ధిక భరోసా కలుగుతుంది. ఈ పరిణామాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే పేదలకు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వసతి కల్పన వంటి శాశ్విత ప్రయోజనాల కల్పనతోనే పేదరికం సమూలంగా నిర్మూలింపబదే అవకాశం ఏర్పడడంతో పాటూ భవిష్యత్తు తరాల బ్రతుకులకు కూడా భరోసా కల్పించినట్లు అవుతుంది.

కైలసాని శివప్రసాద్
94402 03999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News