రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas) అంటే మనకు గుర్తుకు వచ్చేది.. ఆయన సినిమాలతో పాటు.. ఆయన భోజన ప్రియుడని. అతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అని అనిపించుకొనేంలా అతిథి మర్యాదలు చేస్తారు. తనతో పని చేసే తోటి నటీనటులకు కడుపు నిండిపోయేలా ఆహారం పంపిస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్‌కి కూడా ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వెళ్లింది.
ప్రభాస్‌తో (Prabhas) కలిసి నిధి.. ‘ది రాజాసాబ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఇంటి నుంచి నిధికి ఆహారం పంపించారు. ఈ విషయాన్ని నిధి సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ప్రభాస్‌తో పాటు వంశీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని ఆమె సంతోషంగా వ్యక్తం చేశారు.
కాగా, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటింక్, హారర్, కామెడీగా ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా వాయిదా పడింది. కానీ, చివరిగా ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.