Tuesday, June 3, 2025

ఐ లవ్ యు

- Advertisement -
- Advertisement -

ఎవరెన్ని చీకటి వ్యూహాలు పన్నినా
ఏలిన వారు నిశ్శబ్ద కుట్రలు రచించినా
నేనెప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను
నీ చూపుల్లో చూపు కలిపి
నిన్ను గుండెలకు హత్తుకుంటాను
అసలు నువ్వు లేకపోతే
నేను ఏమైపోయే వాణ్ణి?
నా ఉనికిని చెరిపెయ్యాలని
ఎన్ని కాల సర్పాలు
బుసలు కొట్టేవి?
ఎన్ని తుపాన్‌లు నన్ను
అమాంతం చుట్టుముట్టేవి?
అందుకే కలలో కూడా
నిన్నే నేను కలవరిస్తాను
మోడు వారిన బతుకులోకి
స్వేచ్ఛా వసంతంలా
నువ్వు వచ్చిన తరువాతే
నేనిలా పచ్చగా చిగురించాను
నెర్రెలిచ్చిన నేలపైకి జీవనదిలా
నువ్వు వచ్చిన తరువాతే
గోడలు గోడలుగా విడిపోయిన
నా దేశం అఖండ భారతమై పరవశించింది
భగవద్గీత, బైబుల్, ఖురాన్‌ల కంటే
నువ్వే నాకు పరమ పవిత్రం
సనాతన, అధునాతన ధర్మాలెన్ని ఉన్నా
ఈ దేశ ధర్మం ముమ్మాటికీ నువ్వే
ఇజాలెన్ని పెనుగులాడినా
నీ శాసనమే కదా నిజం
పిచ్చాసుపత్రిలో ఎవడో రోగోన్మాది
డాక్టర్‌నే చంపినట్లు..
ఇప్పుడు నీ చుట్టూ
అదృశ్య ఆయుధాలతో
ఆధునిక మనువులు
చౌరస్తాలో అడుక్కునే అనాథ మహిళపై
పగలు, అనురాగాన్ని ఒలకబోసి
రాత్రి రహస్యంగా హింసించినట్లు
నీ మీద ప్రమాణం చేసి
నీ అంగాంగాలను కత్తిరించాలని
ఉరిమి చూస్తున్నారు
జనమంతా నిద్ర పోతున్నప్పుడే కదా
దొంగలు వీరవిహారం చేసేది?
నిద్రపోయే వాడిదే ఇప్పుడు తప్పు
పుట్టిన దేశం రుణం తీర్చుకోవడమంటే
నిజాయితీగా నిన్ను అనుసరించడమే
కంటికి రెప్పలా కాపాడుకుంటూ
నీవు పంచిన విలువలను
అనునిత్యం ఆచరించడమే
ఇప్పుడు దేశభక్తి అంటే..
భారత రాజ్యాంగమా ఐ లవ్ యు

కోయి కోటేశ్వరరావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News