పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ట్రైలర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న చిత్రమిది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ’హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. గురువారం హైదరాబాద్‌లో ’హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
అలాగే అభిమానుల కోసం దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో థియేటర్లన్నీ కళకళలాడాయి. ’హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను మూడు నిమిషాల నిడివితో రూపొందించారు. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు. ఢిల్లీ సుల్తానుల నుండి సనాతన ధర్మాన్ని రక్షించడానికి నడుం బిగించిన యోధుడు, మొఘల్ శక్తిని ధిక్కరించిన వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Veeramallu) కనిపించిన తీరు కట్టిపడేసింది. మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత అపఖ్యాతి పాలైన పాలకులలో ఒకరైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తున్నారు. ’కోహినూర్ వజ్రం’ కోసం పోరాటం, మొఘలులతో వీరమల్లు తలపడటం వంటి సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం మాట్లాడుతూ.. “చరిత్రను గుర్తుచేసే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ చేసిన పూర్తిస్థాయి పాన్ ఇండియా యాక్షన్ చిత్రమిది. ఇప్పటిదాకా మీరు పవర్ స్టార్ ను చూశారు, ఈ సినిమాలో రియల్ స్టార్ ను చూస్తారు”అని అన్నారు. నిర్మాత ఎ.దయాకర్ రావు మాట్లాడుతూ.. “ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా జూలై 24న వస్తుంది. ఆరోజు అసలైన పండుగ జరుపుకోబోతున్నాం. పవన్ కళ్యాణ్ హృదయంలోనుంచి వచ్చే మాటలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుంది”అని పేర్కొన్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. “ఇండియా మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది. అప్పట్లో ఖుషి సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో మొదటి వంద కోట్ల సినిమా గబ్బర్ సింగ్. అది పవర్ స్టార్ అంటే. ఇప్పుడు ఈ సినిమాతో మరో భారీ విజయం సాధించబోతున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక నిధి అగర్వాల్ పాల్గొన్నారు.