అనాదిగా భారతీయ నిచ్చినమెట్ల కులవ్యవస్థలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు అట్టడుగులోకి నెట్టబడ్డారు. ఏళ్ల తరబడి సామాజిక వివక్ష, అణచివేతకు గురై ఆత్మగౌరవం లేకుండా జీవించారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా వీరి జీవితాల్లో ఆశించిన మార్పురాలేదు.మెజారిటీగా వీరు ఉన్నప్పటికీ అగ్రకుల ఆధిపత్యమే కొనసాగిన్నది. ఈ దేశ రాజకీయంలో విద్య, ఉద్యోగాలలో, సంపదలో ఇప్పటికీ వెనుకబడడమే దీనికి కారణం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక బిసి, ఎస్‌సి, ఎస్‌టి జీవితాల్లో కొంత మార్పు మొదలైంది. దీంతో ఈ వర్గాలలో పరిమిత విద్య, ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కూడా లభించాయి. ఈ క్రమంలో కొంత చైతన్యం ప్రారంభమైనది.
ఈ చైతన్యం ద్వారా ఆధిపత్య వర్గాలపై (ruling classes) ధిక్కార స్వరం ప్రారంభమైనా.. పదవుల కోసం పెదవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా 78 ఏళ్ళ స్వాతంత్య్ర భారతదేశంలో అగ్రకులాల కుట్రలకు ఏదో రూపం లో అణగారినవర్గాలు బలైపోయారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ప్రజల చైతన్యం, పోరాటం, ఆత్మగౌరవం బందీ అయిపోతుంది. ఈక్రమంలో ఉత్తర భారతదేశంలో 1980 దశకంలో కాన్షీరాం బహుజన ఉద్యమంతో బడుగు, బలహీన వర్గాలలో అణచివేతకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం మొదలైనది. బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్‌ల సామాజిక, రాజకీయ ఉద్యమం తెర మీదకి వచ్చింది. ఈక్రమంలో బలహీన వర్గాలలో రాజకీయ స్పృహ ప్రారంభమైనది. భారత రాజ్యాంగ హక్కులతో వెనుకబడిన వర్గాలలో బానిసత్వ విముక్తి పోరాటం మొదలైనది. దేశవ్యాప్తంగా ఎవరమెంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం బలపడుతున్నది.
ఇప్పుడు రాజకీయ పార్టీలుసైతం ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. సబ్బండ వర్గాలను కలుపుకోకపోతే తమ ఉనికి ప్రశ్నార్థకం అని స్పష్టంగా తెలిసిపోతున్నది. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో కులగణన అంశం తెరపైకి తెచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కులగణన ప్రక్రియ పూర్తిచేసి బిసి వర్గాలకు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, ఉద్యోగాలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. మరోవైపు దళితుల్లో కూడా వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం చేకూర్చాలని 30 ఏళ్లనుంచి సుదీర్ఘ పోరాటం సాగింది.
ఈక్రమంలో ఎస్‌సి వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయాల్సిన గత్యంతర పరిస్థితి ఏర్పడింది. అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సైతం జనగణనతోపాటు కులగణన చేయడానికి సిద్ధపడింది. ఇది ఒక ప్రజా డిమాండ్‌గా ముందుకెళ్లడంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేయకతప్పలేదు. మొత్తంగా అటు ప్రజల డిమాండ్… ఇటు రాజకీయ పార్టీల అవసరాల దృష్ట్యా సామాజిక న్యాయంపై చర్చ జరుగుతున్నది. అంతర్గతంగా హిందూ ఎజెండా అని చెప్పుకునే బిజెపి, సెక్యులర్ ఎజెండా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలు అనేక రూపాలలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిల ఎజెండాను ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి అంతిమంగా ఈ సోషల్ జస్టిస్ క్షేత్రస్థాయిలో విజయవంతం అవుతుందా? లేదా ఒక మిథ్యగా మిగులుతుందా? ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చారు.
రాష్ట్ర కాంగ్రెస్‌లో రెడ్డి ఎంఎల్‌ఎల ఆధిపత్యం ఉన్నప్పటికీ బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇది మంచి పరిణామమే. కానీ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు పదవులు లభించినా.. అధికారాలు ఇస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు ధనస్వామ్య ప్రజాస్వామ్యంలో జనరల్ స్థానంలో అట్టడుగు వర్గాలు గెలిచే అవకాశం లేదు. తెలంగాణలో మెజారిటీ నామినేటెడ్ పదవులను, ఉన్నత అధికారులలో తమకు అనుచరులుగా ఉండే అగ్రకులాలే వారినే ఇచ్చారు. ఒక శాతం లేని వెలమలు 10 సంవత్సరాలు రాష్ట్రాన్నీ పరిపాలించారు, ఇప్పుడు 5 శాతం ఉన్న రెడ్లు పాలిస్తున్నారు. మరి 90 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు పాలితులుగానే మిగిలిపోయారు. బిజెపిలో కూడా అగ్రకులాలకే ముఖ్య పదవులు ఇచ్చారు. మొత్తంగా అన్ని పార్టీలు ఒకటే. కింది కులాలకు పదవులిచ్చినప్పటికీ అవి రబ్బర్ స్టాంప్ లాంటివే. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఆమోదించిన బిసి రిజర్వేషన్స్ బిల్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెండింగ్‌లోనే పెట్టింది.
రిజర్వేషన్ పరిమితిపై కోర్టు అడ్డంకులు, బిసి రిజర్వేషన్‌లో ముస్లింలను కలిపారని దాటవేస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు గడుపు విధించిన నేపథ్యంలో ఈ బిల్లు కొలిక్కి రాకముందే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడే అవకాశం ఉంది. అప్పుడు అధికార వికేంద్రీకరణకు కేంద్ర బిందువైన స్థానిక సంస్థలలో అట్టడుగు వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ సాధ్యం కానీ బిల్లులు, ప్రకటనలు చేస్తున్నారా? అంటే ఈ పార్టీలలో సామాజిక న్యాయం ఏముంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప. దేశం, రాష్ట్రాలు కులగణన చేయడమంటే సామాజిక న్యాయం, వనరుల సమాన పంపిణీకి విధాన రూపకల్పనగా చెప్పవచ్చు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తూ వనరుల పునఃపంపిణీ జరగడమే. అప్పుడే కులగణన సిద్ధాంతానికి అర్థం. ఈ దేశ నిర్మాణంలో తన రక్తమాంసాలు ధారపోసిన ఈ వర్గాలు అధికారంలోకి రావడమే నిజమైన సామాజిక న్యాయం.
- సంపతి రమేష్ మహరాజ్, 79895 78428