ముంబై: టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషాకు (Prithvi Shaw) ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు జరిమానా విధించింది. యూట్యూబర్ సప్నాగిల్.. పృథ్వీషా మధ్య జరిగిన వివాదం కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఈ కేసులో సప్నా వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున పృథ్వీషాను రూ.100 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షా తరఫు న్యాయవాదికి జూన్ 13నే చివరి అవకాశం కల్పించారు. కానీ, ఇప్పటివరకూ అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కోర్టు రూ.100 జరిమానా విధిస్తూ.. మరో అవకాశం కల్పించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది. అయితే సప్నా తరఫు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్.. షా, అతని న్యాయవాదులు కావాలనే కేసును సాగదీస్తున్నారని వాదనలు వినిపించారు. పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఏదో ఒక కారణం చెబుతూ.. కేసులో వాయిదాలు కోరుతున్నారని అన్నారు.
అసలేం జరిగిందంటే.. 2023 ఫిబ్రవరి 15వ తేదీన ముంబైలోని ఓ స్టార్ హోటల్ వద్ద పృథ్వీషా (Prithvi Shaw).. అతడి స్నేహితులపై కొందరు వ్యక్తులు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. పృథ్వీషా సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించడంతో వాళ్లు దురుసుగా ప్రవర్తించి.. అతడి స్నేహితుడి కారును ధ్వంసం కూడా చేశారు. అంతేకాక.. తప్పుడు కేసులు పెడతామని డబ్బులు డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుడా పృథ్వీషానే మద్యం మత్తులో తమపై దాడి చేశాడని ఆరోపించారు. ఈ ఘటన కాస్త వివాదాస్పదం కావడంతో పోలీసులు సప్నాగిల్‌తో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు సప్నా కస్టడీ నుంచి బయటకు వచ్చారు. వెంటనే ఆమె పృథ్వీషా, అతని స్నేహితులపై అంథేరీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె అంథేరీ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన కోర్టు ఈ అంశంపై నివేదిక సమర్పించాలని పోలీసులను అదేశించి.. విచారణ జరగాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులను సప్నా సవాల్ చేశారు.
Also Read : పసికూన యుఎఇతో టీమిండియా ఢీ… రాత్రి 8.30 మ్యాచ్ ప్రారంభం